లైసెన్స్‌ కావాలా...మొక్క నాటండి

19 Sep, 2017 07:40 IST|Sakshi
గోల్కొండ కేవీ–2లో మొక్కలు నాటిన సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, జేటీసీ పాండురంగనాయక్, ఆర్టీఓ రమేశ్‌

కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌కు రెండు మొక్కలు..
ఆర్టీఏ వినూత్న ప్రచారం
హరితహారానికి  ఊతం


సాక్షి, సిటీబ్యూరో : డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల్లో హరితస్ఫూర్తిని నింపేందుకు ఆర్టీఏ వినూత్న కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. ప్రతి  వాహనదారుడు లెర్నింగ్‌ లైసెన్స్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకొనే సమయంలో తప్పనిసరిగా ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని, వాహనదారుడిగా తమ అనుభవంతో పాటే మొక్క కూడా పెరిగి పెద్దదవుతుందని,  డ్రైవింగ్‌ లైసెన్స్‌కు గుర్తుగా ఉండిపోతుందని ఆర్టీఏ ప్రచారం చేపట్టింది. అలాగే  ‘కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రెండు మొక్కలు నాటండి. కొత్త వాహనం కొనుగోలు చేసిన మీ సంతోషం రెట్టింపవుతుంది.’ అని పేర్కొంటూ పోస్టర్లు, రేడియం స్టిక్కర్లను రవాణా అధికారులు  విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్కూల్‌ పిల్లలు తమ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటాలనే సందేశాన్నిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఖైరతాబాద్‌  ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్‌ నేతృత్వంలో మెహదీపట్నంలోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయం–2లో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టారు. సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్, ఎంవీఐ టీవీ రావు, టీఎన్జీవోస్‌ తెలంగాణ రవాణా ఉద్యోగుల ఫోరమ్‌ ప్రధాన కార్యదర్శి సామ్యూల్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.  
వందలాది మంది విద్యార్ధులతో కలిసి పెద్ద ఎత్తున  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్ధి తన పుట్టిన రోజు కానుకగా ఒక మొక్కను నాటాలని ప్రియాంక వర్గీస్‌ పిలుపునిచ్చారు. హరిత హారంపై వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టిన ఆర్టీఏ కృషిని ఆమె అభినందించారు. ఆర్టీఏ రూపొందించిన రేడియం స్టిక్కర్లు, ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు