సూపర్ ఫిట్

14 May, 2015 00:23 IST|Sakshi
సూపర్ ఫిట్

తమకు 44 శాతం ఫిట్‌మెంట్
ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం... ఆర్టీసీ కార్మికుల్లో ఆనందోత్సాహాలను నింపింది.
దీంతో వివిధ ప్రాంతాల్లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు వేడుకల్లో మునిగి తేలారు

 
 
 సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో బుధవారం సాయంత్రం సిటీ బస్సులు రోడ్డెక్కాయి. గురువారం ఉదయం నుంచి ఆర్టీసీ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. ఆశించిన దానికన్నా ఒక శాతం ఎక్కువే సాధించుకున్న కార్మికులు సమ్మె విరమించి సంబరాలు చేసుకున్నారు. డిపోలు, బస్ భవన్, జూబ్లీ, ఎంజీబీఎస్, తదితర బస్ స్టేషన్ల వద్ద కార్మికులు మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు పేల్చి విజయోత్సవాలు నిర్వహించారు. బుధవారం ఉదయం కార్మికుల ధర్నాతో దద్దల్లిన  బస్‌భవన్ ప్రాంగణం... సాయంత్రం విజయోత్సవ నినాదాలతో మిన్నంటింది. అన్ని డిపోల వద్ద టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల నేతృత్వంలో వేడుకలు జరిగాయి.

44శాతం ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే అప్పటి వరకు సమ్మెలో ఉన్న కార్మికులంతా సంబరాల్లో మునిగిపోయారు. నిరసన ప్రదర్శనలు  విజయోత్సవాలుగా మారాయి. వివిధ ప్రాంతాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంతోషాన్ని ప్రకటించారు. అంతకు కొద్దిసేపటి క్రితం వరకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్మికులు... ఆ తరువాత జిందాబాద్‌లతో హోరెత్తించారు.  గ్రేటర్ హైదరాబాద్‌లోని 28 డిపోలలో పని చేసే సుమారు 24 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, వివిధ కేటగిరీల ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెంపుతో ప్రయోజనం లభించనుంది. మరోవైపు ఎనిమిది రోజుల పాటు బస్సులు నిలిచిపోవడంతో  తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగనున్న  దృష్ట్యా విద్యార్థులు, తల్లిదండ్రులు ఊర ట చెందుతున్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఎంసెట్‌కు 600కు పైగా  ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను యధావిధిగా నడపనున్నట్లు ఈడీ జయరావు చెప్పారు. గురువారం ఉదయం నుంచి అన్ని డిపోల పరిధిలో పూర్తి స్థాయిలో 3850 బస్సులు రోడ్డెక్కనున్న దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా గురువారం నుంచి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
 
నరకం చూశారు...

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నగరంలో ప్రయాణికులు ఎనిమిది రోజుల పాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్  ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు ఉదయం, సాయంత్రం వేళల్లో నరకం చవి చూశారు. మరోవైపు ఆటోలు, ప్రైవేట్ వాహనాల దోపిడీ తారస్థాయికి చేరింది. చార్జీలు రెండు, మూడు రెట్లు పెంచి... ప్రయాణికులను దోచుకున్నారు. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీలు, వివిధ రకాల రవాణా వాహనాలు సైతం నిలువుదోపిడీకి పాల్పడ్డాయి.  ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు ఆటోవాలాల కు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేశారు. టిక్కెట్లు ఇవ్వకుండా కొంతమొత్తం జేబుల్లో వేసుకొని మిగిలిన సొమ్ము ఆర్టీసీ డిపోల్లో జమ చేశారు. నగర శివారు ప్రాంతాలకు, కాలనీలకు రాత్రి వేళల్లో బస్సులు లేకపోవడంతో సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫిట్‌మెంట్ పెంపు నేపథ్యంలో చార్జీలను పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో నగరంలోని 35 లక్షల మంది ప్రయాణికులు భారం మోసేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
 

మరిన్ని వార్తలు