ఆర్టీసీలో ‘చిల్లర’ పంచాయితీ!

12 Sep, 2016 22:20 IST|Sakshi

ఉప్పల్‌: ఆర్టీసీలో చిల్లర పంచాయితీ చినికిచినికి గాలి వానలా మారి ఏకంగా బస్సులను ఎనిమిది డిపోలనుంచి నుంచి కదలకుండా చేసింది. ఉప్పల్‌ డిపోకు చెందిన బస్సులో కండక్టర్‌ వద్ద సరైన చిల్లర లేకపోవడం, ప్రయాణికురాలి వద్ద లభించకపోవడంతో గొడవకు కారణమైంది. ఈ విషయంపై ప్రయాణికురాలు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు కండక్టర్‌ను బదిలీ చేశారు. దీనిపై ఆగ్రహించిన టీఎంయూ నాయకులు బస్సులను డిపోలనుంచి కదలకుండా కట్టడి చేశారు. సోమవారం రెండో రోజు కూడా బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు టీఎంయూ నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీఎంయూ అధ్యక్షుడు సాయిలుగౌడ్‌ మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికులకు ఉద్యోగ భద్రత లేనందునే తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అర్థంలేని టికెట్‌ ధరే ఇందుకు కారణమని ఆరోపించారు. టిక్కెట్‌ ధర రూ. 11, రూ. 21గా నిర్ణయించడంతో చిల్లర ఇవ్వలేకపోతున్నామని, ఈ సమస్య తమకు ఇబందులు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని చిల్లర సమస్యను పరిష్కరించాలని కోరారు. బదిలీ చేసిన కండక్టర్‌ను అదేస్థానంలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు