ఆర్టీసీ పెట్రోల్ బంకులొస్తున్నాయ్..!

4 Jul, 2016 07:24 IST|Sakshi
ఆర్టీసీ పెట్రోల్ బంకులొస్తున్నాయ్..!

- చమురు డీలర్‌గా ఆర్టీసీ కొత్త అవతారం
రాష్ట్రవ్యాప్తంగా 60- 70 వరకు ఏర్పాటు
- త్వరలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం
భారీ లాభాలుంటాయని అంచనా
 
 సాక్షి, హైదరాబాద్ : త్వరలో ఆర్టీసీ పెట్రోలు బంకులు రాబోతున్నాయి. పెట్రోలియం కంపెనీల నుంచి డీలర్‌షిప్ తీసుకుని ఆర్టీసీ వాటిని నిర్వహించనుంది. ఇంతకాలం సొంత బస్సుల కోసం బల్క్‌గా డీజిల్ కొని బస్‌డిపోలలో సొంత బంకులు నిర్వహిస్తూ వచ్చిన రోడ్డు రవాణా సంస్థ ఇక ప్రైవేటు వాహనాలకు కూడా పెట్రోలు, డీజిల్ విక్రయించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 60 నుంచి 70 బంకులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

 ఆదాయం కోసం కొత్త పుంతలు
 ప్రస్తుతం ఆర్టీసీ దాదాపు రూ.2,300 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇక ఏ నెలకానెల నష్టాలు తీవ్రమవుతుండటంతో అప్పులు తీర్చే మార్గమే కనిపించడం లేదు. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.701 కోట్ల రికార్డు స్థాయి నష్టాలు మూటగట్టుకున్న సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే దాదాపు రూ.100 కోట్ల నష్టాలు వచ్చిపడ్డాయి. ఈ నేపథ్యంలో టికెట్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం లేకపోవటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సొంతంగా పెట్రోలు, డీజిల్ బంకులేర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ సొంత అవసరాలకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌పై ఆధారపడింది. టెండర్లలో ఆ సంస్థ తక్కువ మొత్తం కోట్ చేయటంతో తనకవసరమైన డీజిల్‌లో 95 శాతం దాని నుంచే బల్క్‌గా కొంటోంది. దీంతో తాను సొంతంగా ఏర్పాటు చేయబోయే బంకులకు డీలర్‌షిప్స్ కూడా ఆ సంస్థ నుంచే తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది. త్వరలో ఒప్పందం చేసుకోనుంది.

 నిర్వహణ ఇలా...
 రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి భారీగా భూములున్నాయి. ప్రధాన రోడ్లపై ఉన్న స్థలాల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలాంటివి దాదాపు 100 వరకు స్థలాలు సిద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఒక బంకు ఏర్పాటు చేయాలంటే దాదాపు వేయి గజాల స్థలం అవసరం. ఉన్న భూముల్లో 60 నుంచి 70 చోట్ల బంకులేర్పాటుకు అనువుగా ఉన్నట్టు భావిస్తోంది. ఆర్టీసీ పేరుతో పెట్రోలియం కార్పొరేషన్‌ల నుంచి డీలర్‌షిప్ తీసుకుని ఆయా చోట్ల సొంతంగానే బంకులేర్పాటు చేస్తోంది. వాటి నిర్వహణను మాత్రం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పర్యవేక్షిస్తుంది. భారీగా అవసరమయ్యే సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటుంది. బంకు యాజమాన్య హక్కులు మాత్రం ఆయిల్ కార్పొరేషన్‌కే ఉంటాయి. ప్రతి లీటరు డీజిల్, పెట్రోలుపై దాదాపు రూ.1.25 నుంచి రూ.1.80 వరకు ఆర్టీసీకి కమీషన్ వస్తుంది. బంకు ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినందుకు చమురు సంస్థ అద్దె కూడా చెల్లిస్తుంది. వెరసి రెండు రకాలుగా ఆర్టీసీకి ఆదాయం ఉంటుంది. 

మరిన్ని వార్తలు