ఆర్టీసీ బస్సుల ‘బ్రేక్’ డ్యాన్స్

27 Mar, 2016 01:43 IST|Sakshi
ఆర్టీసీ బస్సుల ‘బ్రేక్’ డ్యాన్స్

ఎక్కడికక్కడే నిలిచిపోతున్న ఆర్టీసీ బస్సులు
ప్రతిపాదనలకే పరిమితమైన  మొబైల్ వాహనాలు

 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ ప్రతిపాదనలు ఆరంభశూరత్వమే అనిపిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లపై చెడిపోయి  ఇటు ప్రయాణికులను, అటు వాహనచోదకులను సిటీ బస్సులు బెంబేలెత్తిస్తున్నాయి.రోడ్డెక్కిన బస్సు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో చెడిపోతుందో తెలియ ని పరిస్థితి నెలకొంది. బ్రేక్‌డౌన్స్‌ను  అధిగమించేందుకు డిపోస్థాయిలోనే పూర్తిస్థాయి మరమ్మతులన్నారు.. రోడ్డుపై చెడిపోయిన బస్సుకు క్షణాల్లో రిపేరింగ్‌లన్నారు.. మొబైల్ మెకానిక్ కేంద్రాలన్నారు.. ఇవన్నీ ప్రతిపాదనలే.. ప్రణాళికలే.. ఆచరణలో మాత్రం అంతా శూన్యం. ఫలితంగా  ఎప్పటిలాగే  బస్సులు చెడిపోతున్నాయి. ప్రతి నెలా 200 నుంచి 300 బస్సులు రోడ్లపైనే ఆగిపోతున్నాయి. కాలం చెల్లిన వెయ్యికి పైగా డొక్కు బస్సులు గ్రేటర్ ఆర్టీసీ నష్టాలకు ఆజ్యం పోస్తున్నాయి.

 అంతా ప్రహసనం
ప్రతి రోజూ  పదుల సంఖ్యలో  బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ఎక్కడిక్కడ  ట్రాఫిక్ స్తంభించిపోతోంది. మెట్రో పనుల వల్ల  రహదారులు కుచించుకుపోవడం, అదే మార్గాల్లో  బ్రేక్‌డౌన్స్ కారణంగా  బస్సులు నిలిచిపోవడంతో  నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం బస్సుల్లో వెళ్లే  ప్రయాణికులే కాకుండా, సొంత వాహనాలు, ట్యాక్సీలు, ఆటోలు వంటి వాటిల్లో వెళ్లే ప్రయాణికులు  సైతం  రోడ్లపైనే నిలిచిపోవలసి వస్తోంది. బ్రేక్‌డౌన్స్ నియంత్రణ కోసం  క్షణాల్లో  బస్సు వద్దకు చేరుకొనే మొబైల్ రిలీఫ్  వాహనాలు, బైక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు  పేర్కొన్నారు. విడిభాగాలు, మెకానిక్‌లతో కూడిన 6  మెబైల్ రిలీఫ్ వాహనాలు ట్రాఫిక్ రద్దీకి దారితీసే, మెట్రో పనులు జరుగుతున్న  కోఠీ, లకిడికాఫూల్, ఎల్‌బీనగర్,ఈఎస్‌ఐ,లింగంపల్లి,సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడా వాటి జాడ కనిపించడం లేదు.

రోజుకు 10 నుంచి 15 బస్సులు బ్రేక్‌డౌన్...
గ్రేటర్‌లో 28 డిపోల నుంచి ప్రతి రోజు 3850 బస్సులు  ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్ధ్యం లేనివి. నాణ్యతలేని విడిభాగాల కారణంగా చెడిపోయేవి రోజూ 10 నుంచి  15 బస్సులు ఉంటాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయం నిలిచిపోయినట్లే. ఈ లెక్కన 2500 కిలోమీటర్ల నుంచి 3750 కిలోమీటర్ల వరకు సర్వీసులు నిలిచిపోతున్నాయి.

జీతభత్యాలు, ఇంధనభారం, విడిభాగాల కొనుగోళ్లు వంటి వివిధ కారణాల వల్ల  రోజూ రూ.కోటి నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆర్టీసీకి ఇది మరింత ఆజ్యం పోస్తోంది. ఆక్యుపెన్సీ పడిపోతోంది.

ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ రూ.289 కోట్ల నష్టాలను ఎదుర్కొంటోంది. వీటిలో ఏసీ బస్సులతో పాటు, కాలం చెల్లిన డొక్కు బస్సుల  వల్ల నమోదైనవే ఎక్కువగా ఉన్నాయి.

 హడావిడి చేశారు... వదిలేశారు...
అప్పట్లో  ఎల్‌బీనగర్ నుంచి  పటాన్‌చెరు వెళ్లే బస్సు ఒకటి  పంజగుట్ట చౌరస్తాలో చెడిపోయింది. ఎలక్ట్రానిక్ డివైజ్ కంట్రోలర్  చెడిపోయినట్లు డ్రైవర్ గుర్తించాడు. దాంతో బస్సు అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి.  క్షణాల్లో రెండు కిలోమీటర్‌లకు పైగా  వాహనాలు నిలిచిపోయాయి. జనం  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు  బస్సును అతి కష్టంగా పక్కకు తప్పించారు. ఆ మరుసటి రోజే  అమీర్‌పేట్ మైత్రీవనవం వద్ద  ఇదే తరహాలో మరో బస్సు చెడిపోయింది. రెండు చోట్ల  ట్రాఫిక్ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ట్రాఫిక్ నిర్వహణలో కొరకరాని కొయ్యగా మారిన సిటీబస్సుల బ్రేక్‌డౌన్స్‌పై  ఆర్టీసీ అధికారులు ఎంతో హడావిడి చేశారు. కానీ అంతా మూణాళ్ల ముచ్చటగానే మారింది. తిరిగి బ్రేక్‌డౌన్స్ సమస్య మొదటికొచ్చింది.

ఇదీ పరిస్థితి
నగరంలోని మొత్తం బస్సులు  3850
డిపోలు  28
ప్రయాణికులు  33 లక్షలు
2014 ఏప్రిల్-సెప్టెంబర్ వరకు బ్రేక్‌డౌన్స్ : 1596 (నెలకు సగటున 266 చొప్పున)
2015 ఏప్రిల్-సెప్టెంబర్ వరకు: 2100 (నెలకు సగటున 350 చొప్పున)
2016 జనవరి,ఫిబ్రవరి నెలల్లో సుమారు: 500 బస్సులు

మరిన్ని వార్తలు