ఆర్టీసీ చార్జీల వాత

5 Nov, 2013 03:45 IST|Sakshi
ఆర్టీసీ చార్జీల వాత

 

నేటి అర్ధరాత్రి నుంచే కొత్త చార్జీల అమలు
 =0-14 కిలోమీటర్లపై రూపాయి పెంపు
 =ఆ పైన రూ.2 చొప్పున పెంపుదల
 =పెరిగిన కనీస టికెట్ ధర
 =బస్‌పాస్‌లపై రూ.50 చొప్పున పెంచిన ఆర్టీసీ
 =ప్రయాణికుల బెంబేలు

 
సాక్షి, సిటీబ్యూరో : సగటు ప్రయాణికుడే లక్ష్యంగా ఆర్టీసీ చార్జీల మోత మోగించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు విరివిగా వినియోగించే ఆర్డినరీ బస్సులను సైతం వదిలి పెట్టకుండా గ్రేటర్‌లో బస్సు చార్జీలను పెంచేశారు. నగరంలో మొదటి 14 కిలోమీటర్లకు ఒక రూపాయి చొప్పున, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే  వారిపైన రూ.2 చొప్పున చార్జీలను పెంచుతూ ఆర్టీసీ సోమవారం నిర్ణయించింది. పెరిగిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో చార్జీలు పెంచిన ఆర్టీసీ మొదటి 10 కిలోమీటర్ల ప్రయాణంపై ఎలాంటి భారం మోపకుండా కొంత మేరకు ఊరట కలిగించింది. కానీ ఈసారి తక్కువ దూరం వెళ్లే ప్రయాణికులను కూడా వదిలి పెట్టకుండా పెంచారు.

ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల చార్జీలు, బస్‌పాస్‌ల ధరలు కూడా పెరిగాయి. వివిధ రకాల పాస్‌లపైన రూ.50 చొప్పున పెంచారు. చార్జీల పెంపు వల్ల గ్రేటర్ పరిధిలోని సుమారు 35 లక్షల మంది ప్రయాణికులపై సగటున రూపాయి చొప్పున రూ. 35 లక్షల భారం పడనుంది. ఈ మేరకు చూస్తే నెలకు రూ. 10.50 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇందులో ఒక్క బస్‌పాస్‌లపైనే ప్రతి నెలా రూ.కోటీ 25 లక్షల భారం పడనుంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ ప్రతిరోజు రూ.2.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండగా పెంపు వల్ల ఇది రూ.3.05 కోట్లకు పెరగనుంది.

డీజిల్ ధరల పెరుగుదల, విడిభాగాల ధరలు పెరగడం, బస్సుల నిర్వహణ భారం వంటి వివి ధ రకాల కారణాలతో ఆర్టీసీ 2010 నుంచి ప్రతి సంవత్సరం ప్రయాణికులపై మోత మోగిస్తూనే ఉంది. ఇటీవల పెరిగిన డీజిల్ ధరలు, సీమాంధ్ర సమ్మె నష్టాలు తదితర పరిణామాల దృష్ట్యా చార్జీల పెంపుపై కసరత్తు చేపట్టిన ఆర్టీసీ.. ఎట్టకేలకు సామాన్యుడి రవాణా సదుపాయాన్ని మరింత భారంగా మార్చేసింది. అయితే నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న పుష్పక్ ఏసీ బస్సుల ధరలు మాత్రం పెరగలేదు. వాటి ధరలు ప్రస్తుతం ఉన్న ప్రకారమే యథావిధిగా ఉంటాయని ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి.  

పెరిగిన చార్జీల తీరిదీ...

మొదటి 14 కిలోమీటర్లకు రూపాయి చొప్పున పెరగనుంది. అంటే సికింద్రాబాద్ నుంచి కోఠీ, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, ఎల్‌బీనగర్ నుంచి నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వంటి దగ్గరి రూట్లలో 14 కిలోమీటర్ల వరకు ప్రయాణికుడిపై రూపాయి చొప్పున భారం పడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం 8 రూపాయలు చెల్లిస్తున్న ప్రయాణికుడు ఇక నుంచి 9 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
     
14 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపైన రూ.2 చొప్పున భారం పడనుంది. దిల్‌సుఖ్‌నగర్-పటాన్‌చెరు, సికింద్రాబాద్-బీహెచ్‌ఈఎల్, కోటీ-కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, ఉప్పల్-కొండాపూర్, ఈసీఐఎల్-హైటెక్‌సిటీ వంటి పలు రూట్లలో 14 కిలోమీటర్లు దాటి వెళ్లే ప్రయాణికులు ఇక నుంచి రూ.2 చొప్పున చెల్లించవలసి ఉంటుంది.
     
ఇప్పటివరకు రెండు బస్టాపులు లేదా 4 కిలోమీటర్ల వరకు ఉన్న కనీస టికెట్ ధర కూడా పెరుగుతుంది. ఈ మేరకు ప్రస్తుతం రూ.5 ఉన్న ఆర్డినరీ టిక్కెట్ ధర ఇక నుంచి రూ.6 చొప్పున మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.6 నుంచి రూ. 7కు, మెట్రో డీలక్స్ రూ.7 నుంచి రూ.8 కి, ఏసీ బస్సు 10 రూపాయల నుంచి  రూ.12 కు పెరుగనున్నాయి.

 2.5 లక్షల పాస్ వినియోగదారులపై భారం

 గ్రేటర్‌లో ప్రతి రోజు 2.5 లక్షల మంది ఆర్టీసీ బస్‌పాస్‌లపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికులను సైతం అధికారులు టార్గెట్ చేశారు. రూ.50 చొప్పున పెంచారు. బస్‌పాస్‌ల పైన ఇప్పటి వరకు ఆర్టీసీకి నెలకు రూ.18.75 కోట్ల ఆదాయం లభిస్తుండగా పాస్ ధరల పెంపు వల్ల మరో రూ.కోటీ 25 లక్షలు అదనంగా రానుంది. దీంతో పాస్‌లపై నెలకు రూ. 20 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు