ఆర్టీసీలో సమ్మె సైరన్

1 Aug, 2014 01:50 IST|Sakshi

 సీసీఎస్ నుంచి తీసుకున్న నిధులు చెల్లించాలని ఈయూ డిమాండ్
 ప్రభుత్వం గ్రాంటు ఇస్తే చెల్లిస్తామన్న అధికారులు
 2 నుంచి సమ్మెలోకి వెళుతామని ప్రకటించిన కార్మికసంఘాలు

 
సాక్షి, హైదరాబాద్: కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) నిధులను సొంతానికి వాడుకుని తిరిగి జమచేయని అంశం ఆర్టీసీలో చిచ్చురేపుతోంది. నిధులకోసం కార్మికులు సమ్మెబాట పట్టారు. శనివారం నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్టు ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ వేణుగోపాల్‌కు కార్మిక నేతలు తేల్చి చెప్పారు. సీసీఎస్‌కు సంబంధించి ఆర్టీసీ  ఇప్పటికే రూ.220 కోట్లను వాడుకుంది.
 
వడ్డీతో కలిపి ఇది రూ.293 కోట్లకు చేరింది. క్రెడిట్ సొసైటీకి ఈ సొమ్మును జమచేయకపోవటంతో కార్మికులకు రుణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొంతకాలంగా ఈయూ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేస్తున్నారు. ఈక్రమంలో రెండు రోజులుగా హైదరాబాద్, విజయవాడల్లో  నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ వేణుగోపాల్ ఈయూ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు.
 
యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, తెలంగాణ ప్రతినిధులు బాబు, భాస్కరరావు, మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు దామోదరరావు, సోమరాజు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ సీసీఎస్ సొమ్మును చెల్లించే పరిస్థితి లేదని, ప్రభుత్వం గ్రాంటు ఇస్తే సీసీఎస్‌కు జమ చేస్తామని ఇన్‌చార్జి ఎండీ వేణుగోపాల్ వారికి స్పష్టం చేశారు.

అయితే దీనికి ఒప్పుకోని నేతలు వెంటనే సీసీఎస్ నిధులు జమచేయని పక్షంలో ముందు హెచ్చరించినట్టుగా రెండో తేదీ నుంచి సమ్మె ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. అయితే సమ్మె విషయంలో ఈయూతో మరో ముఖ్య కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) విభేదిస్తోంది. ముందస్తు నోటీసులు లేకుండా సమ్మెచేయడం సరికాదని పేర్కొంది.
 
4న ఎర్రబ్యాడ్జీలతో నిరసన : ఎన్‌ఎంయూ
ఆర్టీసీలో వేతన సవరణ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. తదితర విషయాల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ 4న కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధుల్లో పాల్గొంటారని ఎన్‌ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు