సభ సాక్షిగా తప్పుచేసి..

22 Mar, 2016 03:31 IST|Sakshi
గతంలో ఈనాడు పత్రికలో కాల్‌మనీపై ప్రచురితమైన కథనం..

సరిదిద్దుకునేందుకు ప్రివిలేజ్ కమిటీని వాడుకున్న ప్రభుత్వం
ఆ కమిటీలో మెజారిటీ సభ్యులు అధికారపక్షం వారే
అధికారపక్షం దూషణలు పట్టించుకోని కమిటీ
ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి నోట్‌ను పట్టించుకోని వైనం
గతంలో ఎన్నడూ ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చించని సభ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రివిలే జ్ కమిటీని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోంది. ప్రతిపక్ష నేతతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై శాసనసభలో ఇష్టం వచ్చినట్లు పలు సందర్భాల్లో నోరు పారేసుకున్న చరిత్ర కలిగిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఇచ్చిన నివేదికకు ఉన్న చట్టబద్ధతపై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను శాసనసభ నుంచి గత డిసెంబర్ 18న ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఆక్షేపించగా, నిబంధనలు విరుద్ధంగా ఈ సస్పెన్షన్ ఉందంటూ హైకోర్టు నిలుపుదల చేసింది.

ఈ నేపథ్యంలో తాము చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. డిసెంబర్‌లో జరిగిన సమావేశాల్లో రోజా అనుచితంగా ప్రవర్తించారని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సస్పెన్షన్ సమయంలో ప్రకటించారు. రోజా అసెంబ్లీలో కామ చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారని, అందుకే సస్పెండ్ చేశామని అధికారపక్షం ప్రచారం చేసింది. ఆమె, ఇతర ప్రతిపక్ష సభ్యులు చేశారని చెప్తున్న వ్యాఖ్యలను ఎంపిక చేసి మీడియాకు లీక్ చేసింది. తమ సభ్యులు చేసిన వ్యాఖ్యల జోలికి మాత్రం అధికార పక్షం వెళ్లలేదు. వాస్తవానికి రోజా కాల్‌మనీ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని కామ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ‘ఈనాడు’ లాంటి దినపత్రికలు కూడా కాల్‌మనీని ‘కామ’ అని రాసిన సందర్భాలున్నాయి. శీర్షికల్లో కూడా ‘కామాంతకులు’ అని పొందుపరిచారు.

 అనితను అస్త్రంగా చేసుకుని..
సభ నుంచి రోజా సస్పెన్షన్‌పై అప్పట్లోనే నిరసన వ్యక్తమైంది. దీంతో ఆమె  డిసెంబర్ 18న చేశారని చెప్తున్న వ్యాఖ్యలపై అదే నెల 22న ప్రతిపక్షం సభలో లేకుండా చూసి అయిదు, పది నిమిషాల్లో పూర్తయ్యే జీరో అవర్‌ను గంటల తరబడి కొనసాగించి అధికార పార్టీ సభ్యులు వంగలపూడి అనితతో ఫిర్యాదు చేయించారు. ఆమెను ఒక అస్త్రంగా వాడుకున్నారు. దీంతో స్పీకర్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మెజారిటీ సభ్యులు అధికారపక్షం నుంచే ఉండటం గమనార్హం. ఆ కమిటీ ప్రతిపక్షం నుంచి సభ్యుడిగా ఉన్న గడికోట శ్రీకాంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలు ఏ ఒక్కటీ ఆమోదించకపోగా, అసమ్మతి నోట్‌ను కూడా పట్టించుకోకుండా తాము ఇవ్వాలనుకున్న నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ.. అనిత జీరో అవర్‌లో ప్రస్తావించిన అంశం, ప్రివిలేజ్ నోటీస్ ఆధారంగా రోజాపై విచారణ చేపట్టింది. అయితే తన సస్పెన్షన్‌కు సంబంధించి కోర్టు కేసుల విషయంలో తీరిక లేకుండా ఉండటం, ఆనారోగ్యం వల్ల కమిటీకి హాజరు కాలేనని రోజా కమిటీకి రాతపూర్వకంగా తెలిపారు.

అయినా కమిటీ వాటిని పట్టించుకోలేదు. ఈ ప్రివిలేజ్ కమిటీలో ఏడుగురు సభ్యులుంటే ఐదుగురు అధికారపక్షం నుంచే ఉన్నారు. కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన గొల్లపల్లి సూర్యారావు.. 14వ శాసనసభ ఆరంభం నుంచి తనకు ఏమాత్రం ప్రసంగించే అవకాశం వచ్చినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పదే పదే విమర్శించటమే అలవాటుగా పెట్టుకున్నారు. ఆయనే చైర్మన్‌గా ఉన్న కమిటీ సహజంగానే వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా నివేదికపై తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. అయినా కమిటీ పట్టించుకోలేదు.

 మరో అవకాశం ఎందుకివ్వలేదు?
ప్రివిలేజ్ కమిటీకి అధికారపక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు పలు పిటిషన్లు అందచేశారు. అధికారపక్షం అందచేసిన పిటిషన్లు బుల్లెట్ స్పీడ్‌తో కమిటీ ముందు విచారణకు వస్తుంటే ప్రతిపక్ష   సభ్యులు అందజేసిన పిటిషన్లు కనీసం నత్తనడకతో సమానంగానైనా కమిటీ ముందు విచారణకు రాలేదు. ఇదే విషయాన్ని కమిటీలోని విపక్ష సభ్యులు చైర్మన్‌ను గట్టిగా ప్రశ్నించినా  ఫలితం శూన్యం. రోజాపై చర్యను తప్పుపడుతూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ  డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం తాము నిబంధనలకు విరుద్ధంగా ఆమెను సస్పెండ్ చే శామని ఒక నిర్ధారణకు వచ్చి, సస్పెన్షన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రివిలేజ్ కమిటీని ఉపయోగించుకుంది. డిసెంబర్ 18వ తేదీన రోజాను సస్పెండ్ చేశారు. అప్పట్లో రోజా విషయంలో అంతగా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే అనిత అధికారపక్ష ప్రేరేపణతో 22న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీయే ఆమెకు మరో అవకాశం ఇస్తే సరిపోయేది. కానీ కమిటీ వాస్తవాలు పట్టించుకోకుండా కమిటీలోని విపక్ష సభ్యుల అసమ్మతిని ఖాతరు చేయకుండా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అధికార పక్షం నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది.

వాస్తవానికి గతంలో ఎన్నడూ ప్రివిలేజ్ కమిటీ నివేదికపై సభలో చర్చించలేదు. రోజా విషయంలో మాత్రం వెంటనే సభలో చర్చకు చేపట్టి ఎప్పటిలాగే విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అధికారపక్షం ఆరోపణలు, విమర్శల దాడి కొనసాగించింది. చివరకు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ అవకాశం ప్రివిలేజ్ కమిటీయే ఇస్తే సరిపోయేదని, అలా కాకుండా సుదీర్ఘంగా చర్చించి, పనిలో పనిగా విపక్షంపై ఆరోపణలు గుప్పించిన తర్వాత రోజాకు మరో అవకాశం అనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టు ఆక్షేపించినా, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా రోజాను అసెంబ్లీ లోనికి ఎందుకు అనుమతించలేదని అంటున్నారు.  సభ సాక్షిగా తప్పుచేసి మసిపూసి మారేడుకాయ చేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు