అక్టోబర్ 27 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు

27 Sep, 2016 01:16 IST|Sakshi

- 29వ తేదీ నాటి పరీక్ష 31న నిర్వహణ
- ఎస్‌ఏ-1 పరీక్షల్లోనూ 9, 10 తరగతులకు 11 పేపర్లు
- పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వచ్చే నెల 27 నుంచి నవంబర్ 3 వరకు సంగ్రహణాత్మక మూల్యాంక నం (ఎస్‌ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 29 న నరక చతుర్దశి (ఐచ్ఛిక సెలవు) అయినందున 29న నిర్వహించాల్సిన పరీక్షను 31వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. మారిన షెడ్యూల్ ప్రకా రం పరీక్షలు నిర్వహించాలని డీఈవోలను ఆదేశించారు. 5వ తేదీన కచ్చితంగా ఫలితాలను విద్యార్థులకు వెల్లడించాలని చెప్పారు. అదేరోజు తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను (క్యుములేటివ్ రికార్డులు) అందజేయాలని సూచించారు.

విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులపై సంతకాలు తీసుకొని 7లోగా టీచర్లు లేదా ప్రధానోపాధ్యాయులకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వారికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6,7,8  తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని వివరించారు. ఒకటి నుంచి 7వ తరగతి వారికి మొదటి రోజు ప్రథమ భాషతో పరీక్షలు ప్రారంభించాలని, 8, 9, 10 తరగతుల వారికి గణితంతో పరీక్షలు ప్రారంభించాలని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో(సీసీఈ) భాగంగా ఎస్‌ఏ-1 పరీక్షల్లోనూ 9, 10 తరగతుల విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు