విశ్వనగరంగా చేసి చూపిస్తా..

1 Feb, 2016 02:21 IST|Sakshi
విశ్వనగరంగా చేసి చూపిస్తా..

‘సాక్షి’తో గ్రేటర్ ఎన్నికల టీఆర్‌ఎస్ ప్రచార రథసారథి కేటీఆర్
ఐదేళ్లలో అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్
దత్తత అంటే రంగులు, రోడ్లు వేయడమే కాదు.. అన్నివిధాలా అభివృద్ధి
ముఖ్యమంత్రి నాకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తా
అధికారులు, కార్పొరేటర్, స్థానిక సంక్షేమ సంఘాలతో వాట్సప్ గ్రూపులు
ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగం
ప్రజలకు కావాల్సిన అవసరాలను ఆన్‌లైన్ చేసి అవినీతిని అరికడతామని వెల్లడి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా    

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులో నుంచి డబ్బులు తీసి రంగులు పూసి, రోడ్లు వేసి వెళ్లిపోవడం కాదని ఓ సినిమాలో డైలాగ్... అది నిజమే, అభివృద్ధి అంటే రంగులు, రోడ్లు మాత్రమే కాదు. అన్ని విధాలుగా బాగు చేస్తేనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ బాధ్యత తీసుకున్నప్పుడు దీనిని అన్ని విధాలుగా బాగు చేసినప్పుడే విశ్వనగరం అవుతుంది. ఓ డాలస్ కావాలన్నా, ఒక షాంఘైలా ఉండాలన్నా, న్యూయార్క్‌లా కనిపించాలన్నా దానికి తగ్గట్టు ప్రణాళిక ఉండాలి.

ఆ ప్రణాళికను అమలు చేయడానికి కనీసం నాలుగైదేళ్లు పడుతుంది. మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోను. అన్నిటికీ మించి ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడి సమస్యలపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఘంటాపథంగా చెపుతున్నా.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తా’ అని జీహెచ్‌ఎంసీ ఎన్నికల టీఆర్‌ఎస్ ప్రచార సారథి, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు.

ఆదివారం చివరిరోజు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన మధ్యలో కొద్దిసేపు సాక్షి ప్రత్యేక ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా జంట నగరాల అభివృద్ధికి తాను చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ‘‘పూర్తిగా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అమల్లోకి వస్తేనే విశ్వనగరం కల సాకారమవుతుంది.. అప్పుడు ఎవరు కాదన్నా ఇది విశ్వనగరం అవుతుంది. మాటలు చెప్పడంతోనే కాదు ఆచరణలో పెట్టడానికి అవసరమైన అంకితభావంతో పనిచేస్తా..’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహా నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కమ్యూనికేషన్ సదుపాయాలను వినియోగించుకుంటామన్నారు.

ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...

విశ్వనగరంగా హైదరాబాద్ బాధ్యతలను ముఖ్యమంత్రి మీపై పెట్టారు. ఈ యజ్ఞంలో సఫలమవుతారా?
కేటీఆర్: నాకైతే పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడి సమస్యలపై అవగాహన ఉంది. అదే విధంగా విశ్వనగరంగా గుర్తింపు ఎలా తీసుకురావాలన్నదానిపైనా అవగాహన ఉంది. అమెరికాలో కొంతకాలం ఉద్యోగం చేశాను. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరాలు చూశా. వాటికి అంత పేరు రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై అవగాహన ఉంది. అందువల్ల నాకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తానన్న నమ్మకం ఉంది.

మున్సిపల్ బాధ్యతలు చేపట్టాక మీ మొదటి ప్రాధాన్యత?
కేటీఆర్: ముఖ్యమంత్రి నా మీద గురుతరమైన బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని నిలబెడతా. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడం నా మొదటి కర్తవ్యం. దీనికి అవసరమైన వారందరి సహకారం తీసుకుంటా. ముఖ్యంగా రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఏదవసరమో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తా.

ప్రజలకు ఏం చేయబోతున్నారు?
కేటీఆర్: గత ఆర్నెల్లలో హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించాను. సమస్యలపై అవగాహన ఉంది. రెప్పపాటు కరెంట్ పోకుండా సఫలమయ్యాం. తెలంగాణ వస్తే చీకట్లే అన్న వారికి ఇదో గుణపాఠం. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను హైదరాబాద్‌తో అనుసంధానించబోతున్నాం. ఎక్కడ సమస్య వచ్చినా కరెంట్ సరఫరాకు ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం. మంచినీటికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు రూ.6,700 కోట్లతో నగరానికి ఇరువైపులా శామీర్‌పేట్, రాచకొండలో రెండు రిజర్వాయర్లు నిర్మించబోతున్నాం. మిగులు విద్యుత్ లాగా మిగులు మంచినీరు కోసం మా ప్రయత్నం.

పౌరులకు ఎలాంటి కొత్త సదుపాయాలు అందిస్తారు?
కేటీఆర్: పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆన్‌లైన్ వ్యవస్థ ప్రవేశపెడతాం. ఎవరైనా ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలన్నా.. నివాస యోగ్యత అనుమతి అవసరమైనా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఏ ఇతర  అవసరం వచ్చినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకువస్తాం. దరఖాస్తులు పరిష్కారమయ్యేదాకా ఎప్పటికప్పుడు పురోగతి తెలుసుకోవచ్చు. ఏయే పని ఎప్పటిలోగా పరిష్కారించాలన్న గడువు నిర్దేశిస్తాం. నిర్దేశిత గడువులో పని చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా చట్టాలు సవరిస్తాం.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీరు సొంతంగా మెజారిటీ సాధిస్తారా?
కేటీఆర్: కచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది. గత 18 నెలల్లో మా ప్రభుత్వం హామీలిచ్చినవే కాదు.. ఇవ్వనివాటిని కూడా అమలు చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ. దీనిని ఎంత అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రజలకు ఫలాలు అంతగా ఉంటాయి. మేం మేయర్ పీఠం గెలవడమే కాదు మా గెలుపునకు దోహదపడిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం.

ఆయా డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాలనీలు, అపార్టుమెంట్ల అసోసియేషన్లు అందరినీ సమన్వయం చేసుకునేందుకు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా ఎలాంటి సమాచారం వస్తుందో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం బాధ్యులైన అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. నేనూ స్వయంగా ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తా.

స్థానిక సంస్థల్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తారనే ఆరోపణలున్నాయి. వాటిపై ఏ చర్యలు తీసుకుంటారు?
కేటీఆర్: నిజమే. ఇకపై ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకోబోతున్నాం. అవినీతిని అరికట్టడంతో పాటు ప్రజల నుంచి పన్నుల రూపేణా వచ్చిన ప్రతీ పైసా వారి అభివృద్ధికి ఉపయోగపడాలి. దానికోసం జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవడం ద్వారా అన్నీ పారదర్శకంగా ఉండేలా చూస్తాం.
 
తరచుగా హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు.. విశ్వనగరం అంటే స్పష్టత ఇస్తారా?
కేటీఆర్: ప్రపంచంలో వందల కొద్దీ నగరాలు ఉన్నాయి. కానీ విశ్వనగరాలంటే మనకు న్యూయార్క్, డాలస్, షాంఘై, లండన్, శాన్‌ఫ్రాన్సిస్కో ఇలా ఓ పది, పదిహేను గుర్తుకు వస్తాయి. హైదరాబాద్‌ను ఆ స్థాయికి తీసుకుపోవడానికి అవసరమైన అన్ని హంగులు ఉన్నాయి. గత ప్రభుత్వాలు, ఇప్పటిదాకా జీహెచ్‌ఎంసీని పాలించిన వారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేం ఓ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు పోతున్నాం. దానికి తగ్గట్లు మా పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. విశ్వనగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావడానికి అవసరమైన అధునాతన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. రహదారులు, రవాణా, మురుగునీటి పారుదల వ్యవస్థ, స్వచ్ఛమైన మంచినీరు అన్నిటికీ మించి పరిశుభ్రత ఉట్టిపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతాం.

ప్రపంచశ్రేణి వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా చూడడం, నిర్మాణ రంగంలో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంస్కరణలు అమలు చేయడం వంటివన్నీ విశ్వనగరం కావడానికి దోహదపడతాయి. నేను ఐటీ మంత్రి అయ్యాక అమెరికా వెళ్లి ప్రముఖ ఐటీ కంపెనీలను కలిశాను. గూగుల్ త్వరలోనే పెద్ద క్యాంపస్‌ను ఇక్కడ నెలకొల్పబోతోంది. ఫేస్‌బుక్ కూడా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకోబోతోంది. ఇంకా అనేక కంపెనీలు వస్తాయి.

మరిన్ని వార్తలు