ఇదీ సాక్షి పాఠకుల సంఖ్య

22 Jan, 2018 02:06 IST|Sakshi

ఐఆర్‌ఎస్‌ సర్వేలో వెల్లడి 

పాఠకుల సంఖ్య.....93,41,000

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి దినపత్రికను ప్రతిరోజూ 93.41 లక్షల మంది పాఠకులు చదువుతున్నారని ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే (ఐఆర్‌ఎస్‌)–2017 తేల్చింది. ఈ సర్వేలో ప్రాంతీయ, హిందీ పత్రికలే అగ్రస్థానంలో నిలిచాయి. ఇంగ్లిష్‌ పత్రికలను వెనక్కి నెట్టి టాప్‌–10 స్థానాలను ఇవే కైవసం చేసుకున్నాయి. హిందీ పత్రికల పాఠకుల సంఖ్యలో ఏకంగా 45 శాతం వృద్ధి నమోదైంది. 7 కోట్ల పైచిలుకు పాఠకులతో దైనిక్‌ జాగరణ్‌ మొదటి స్థానంలో, 5.23 కోట్లతో హిందుస్థాన్, 4.6 కోట్లతో అమర్‌ ఉజాలా పత్రికలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రీడర్‌షిప్‌ స్టడీస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌ఎస్‌సీఐ), మీడియా రీసెర్చ్‌ యూజర్స్‌ కౌన్సిల్‌(ఎంఆర్‌యూసీ)లు తాజాగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించాయి.

గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పత్రికలు కొత్తగా 11 కోట్ల మంది పాఠకులను సంపాదించుకున్నాయి. 2014 ఐఆర్‌ఎస్‌ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం పాఠకుల సంఖ్య 29.5 కోట్లు కాగా ప్రస్తుతం అది 40.7 కోట్లకు చేరింది. కొత్తగా చేరిన ఈ పాఠకులు పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 7 కోట్లు ఉండటం గమనార్హం. అలాగే 12 ఏళ్లు పైబడిన వారిలో పాఠకుల సంఖ్య 9 శాతం పెరిగినట్టు తేలింది. ‘‘ఈ అంకెలు ప్రింట్‌ రంగానికి మున్ముందు ఉజ్వల భవిష్యత్‌ ఉందనడానికి అద్దం పడుతున్నాయి’’ అని ఎంఆర్‌యూసీ చైర్మన్‌ ఆశిష్‌ భాసిన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు