'సాక్షి' స్పోర్ట్స్ ఎడిటర్ హఠాన్మరణం

3 Dec, 2016 03:05 IST|Sakshi
'సాక్షి' స్పోర్ట్స్ ఎడిటర్ హఠాన్మరణం

గుండెపోటుతో కన్నుమూసిన జయప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ‘సాక్షి’  స్పోర్ట్స్ ఎడిటర్ బత్తినేని జయప్రకాశ్ (38) శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. తీవ్ర గుండె పోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జయప్రకాశ్‌కు భార్య శిరీష, ఇద్దరు పిల్లలు రేవంత్ (7), సాయి దేదీప్య (3) ఉన్నారు. శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతుండగా.. బాత్రూంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా అప్పటికే మరణించారు.
 
అంచెలంచెలుగా...
ఖమ్మం జిల్లాకు చెందిన జయప్రకాశ్ 2003 డిసెంబర్‌లో ఈనాడు జర్నలిజం స్కూల్‌లో చేరారు. శిక్షణ అనంతరం హైదరాబాద్ బ్యూరో లో దాదాపు మూడేళ్లపాటు  స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పని చేశారు. ఏడాది విరామం తర్వాత 2008 మార్చిలో ‘సాక్షి’లో చేరి దినపత్రిక ప్రారంభం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం  స్పోర్ట్స్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన విధి నిర్వహణలో భాగంగా మూడు టి20 క్రికెట్ ప్రపంచ కప్‌లు, 2011 వన్డే వరల్డ్ కప్‌తో పాటు అనేక అంతర్జాతీయ టోర్నీలను ప్రత్యక్షంగా కవర్ చేశారు. పలువురు ప్రముఖ, అగ్రశ్రేణి క్రీడాకారులను ఇంటర్వ్యూ చేసి క్రీడా పాత్రికేయంలో తనదైన ప్రత్యేకతను కనబరిచారు.

‘సాక్షి’ చైర్‌పర్సన్ దిగ్భ్రాంతి...
జయప్రకాశ్ మృతి పట్ల ‘సాక్షి’ చైర్‌పర్సన్ వై.ఎస్ భారతిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, ఫైనాన్స్ డైరెక్టర్ వై.ఈశ్వర ప్రసాద్ రెడ్డి... జయప్రకాశ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ సంతాపం ప్రకటించాయి.

ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపాయి. ‘జేపీ’గా చిరపరిచితుడైన జయప్రకాశ్ మృతితో సహచరులు, సన్నిహితుల్లో విషాదం అలముకుంది. ఆయనతో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ అంత్యక్రియలు శనివారం ఆయన స్వస్థలం మధిర సమీపంలోని అంబారుపేటలో జరుగుతాయి.

మరిన్ని వార్తలు