సలాం సింగపూర్ ప్రైవేట్

20 Jul, 2016 02:00 IST|Sakshi
సలాం సింగపూర్ ప్రైవేట్

రాజధానిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల షరతులకు తలొగ్గిన రాష్ట్ర సర్కారు
 
- స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరుతో భారీ అవినీతి
- ముసాయిదా రాయితీ, అభివృద్ధి ఒప్పందాన్ని గుడ్డిగా ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం
- సకాలంలో భూమి ఇవ్వకపోతే ఏడీపీకి నెలకు రూ. కోటిన్నర చొప్పున పరిహారం
- మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది సర్కారే
- పూర్తయ్యే దాకా మరోచోట అభివృద్ధి వద్దట
ఒప్పందంలో ప్రజలకు నష్టం చేసేవి ఎన్నెన్నో....
- రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో సింగపూర్ కంపెనీల ‘రియల్’ దందా
 
 సాక్షి, హైదరాబాద్ : భూములు రైతులవి... పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వానిది, అంటే ప్రజలదే... అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేది మాత్రం సింగపూర్ ప్రైవేట్ సంస్థలు. ఆ రూ.వేల కోట్లలో కొంత సొమ్ము ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి కమీషన్ల రూపంలో వెళ్లనుంది. అంతిమంగా నష్టపోయేది రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, ప్రజలే. పాలకులు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు ఫణంగా పెడుతున్నారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా(1,691 ఎకరాలు) అభివృద్ధి పేరిట భారీ దోపిడీకి సర్కారు పెద్దలు, సింగపూర్ కంపెనీలు ఉమ్మడిగా తెరతీశాయి. ప్రభుత్వం ఏ పనికైనా టెండర్లను ఆహ్వానిస్తే తానే నిబంధనలను, షరతులను విధించడం పరిపాటి. అయితే ఇక్కడ సింగపూర్ సంస్థలే రాష్ట్ర ప్రభుత్వానికి షరతులను విధించాయి. ప్రభుత్వం వాటిని గుడ్డిగా ఆమోదించేసింది. సింగపూర్ సంస్థలకు పూర్తిగా దాసోహమంది.

 పరిపాలన కేంద్రాన్ని తరలించొద్దు
 ప్రభుత్వం ఆమోదించిన ముసాయిదా రాయితీ, అభివృద్ధి ఒప్పందంలో సింగపూర్ కంపెనీలకు లాభం, రాష్ట్ర ప్రజలకు నష్ట చేకూర్చే అంశాలెన్నో ఉన్నాయి. దీని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్(ఏడీపీ)కు సకాలంలో భూములను ఇవ్వకపోతే నెలకు రూ.కోటిన్నర చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంది. 18 నెలల్లోగా భూములను అప్పగించకపోయినా, మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయినా పరిహారం చెల్లించక తప్పదు. ఈ విషయాన్ని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకసారి ఒప్పందాలు కుదిరిన తరువాత రాజధాని పరిధిలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉండదు. స్టార్టప్ ఏరియాలో తాము చేపట్టే ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ మొత్తం రాజధాని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టరాదంటూ సింగపూర్ సంస్థలు విధించిన షరతుకు ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా కీలక ప్రభుత్వ పరిపాలన ప్రాంతాన్ని అక్కడి నుంచి మరోచోటుకు తరలించకూడదని సింగపూర్ కంపెనీలు షరతు పెట్టాయి.

 అలాంటి ప్రాజెక్టు మరోచోట ఉండొద్దు
 స్టార్టప్ ఏరియాను మూడు దశల్లో 15 సంవత్సరాల్లో గానీ అభివృద్ధి చేయరు. అవసరమైతే మరో ఐదేళ్లపాటు కాలపరిమితిని పొడిగించేందుకు వెసులుబాటు ఉంది. అంటే 20 ఏళ్లపాటు రాజధాని ప్రాంతంలో సింగపూర్ సంస్థలు చేపడుతున్న ప్రాజెక్టు తరహాలో మరోచోట ప్రాజెక్టు చేపట్టకూడదు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ దాని బయట మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకూడదు. అనుమతులు ఇవ్వకూడదు. స్టార్టప్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్ల వ్యయంతో 18 నెలల్లో మౌలిక సదుపాయాలను కల్పించా ల్సి ఉంటుంది. అంతేకాకుండా కృష్ణా నది కరకట్ట పటిష్టం, ఎత్తు పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాలి. ఈ భూముల్లో ప్రార్థనా మందిరాలను, శ్మశానాలను, చెట్లను ప్రభుత్వం తన సొంత ఖర్చుతో తొలగించాలి.

► కోర్ ఏరియాలో మౌలిక సదుపాయాలను కల్పించాలి.
► వరద నియంత్రణ ప్రాజెక్టును చేపట్టాలి. స్టార్టప్ ఏరియా బయట వరద నీటిని నియంత్రించాలి.  
► రహదారులు, వంతెనలు నిర్మించాలి. సబ్ స్టేషన్లు, నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
► అవసరమైన ఇసుకను సరఫరా చేయాలి.
► ప్రధానమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డ్రైనేజీ ఔట్ ఫ్లో కృష్ణా నదిలోకి వెళ్లేలా చూడాలి. స్టార్టప్ ఏరియా గుండా మురికి కాలువలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.
► ప్రధాన మంచినీటి సరఫరా పైపు నిర్మాణం చేపట్టాలి. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
► భూములను తనఖా పెట్టి ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి.
► ప్రస్తుతం ఉన్న విద్యుత్ లైన్లను, లో ఓల్టేజీ కేబుల్స్‌ను స్టార్టప్ ఏరియా బయటకు తరలించాలి.
► స్టార్టప్ ఏరియా తొలి దశకు కనీసం 300 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. సర్వీసు కారిడార్స్‌కు అవసరమైన భూగర్భ కేబుల్స్ వేయాలి. రెండు, మూడు దశలకు 860 మెగావాట్ల విద్యుత్  సరఫరాకు ఏర్పాట్టు చేయాలి.
► టెలిఫోన్ నెట్‌వర్క్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు చేయాలి.
► గ్యాస్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
► స్టార్టప్ ఏరియా బయట పార్కులను నెలకొల్పాలి. గ్రీనరీని పెంచాలి.
► స్టార్టప్ ఏరియాకు ప్రకాశం బ్యారేజీ నుంచి తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

>
మరిన్ని వార్తలు