‘మహా’ ఇసుక కాంట్రాక్టర్ల దౌర్జన్యం

2 May, 2018 02:52 IST|Sakshi

సబ్‌ కలెక్టర్, రెవెన్యూ అధికారుల బృందంపై రాళ్ల దాడి

రెవెన్యూ సిబ్బందికి గాయాలు... మంజీరా సరిహద్దులో ఉద్రిక్తత

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/కోటగిరి: మహారాష్ట్ర ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు దౌర్జన్యానికి తెగబడ్డారు. మంజీరా నదిలో మహారాష్ట్ర క్వారీ పేరుతో తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తుండగా అడ్డుకున్న బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నేతృత్వంలోని తహసీల్దార్ల బృందంపై దాడికి పాల్పడ్డారు.

సుమారు 50 మంది రాళ్లతో దాడి చేశారు. జప్తు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు నది ఒడ్డు వరకు తెచ్చిన 4 జేసీబీలు, డోజర్లను తిరిగి లాక్కెళ్లిపోయారు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యా యి. అధికారుల ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల పరిధిలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

మంజీరా నదిలో మహారాష్ట్ర వైపు ఉన్న శాఖా పూర్‌ క్వారీలో ఇసుక తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీ కాంట్రాక్టర్‌ నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి.. రాష్ట్ర భూభాగంలోకి వచ్చి ఇసుక తవ్వుతున్నాడు. పేరుకు మహారాష్ట్ర క్వారీ అయినా.. తోడేస్తున్నది మాత్రం తెలంగాణ భూభాగంలోనే. రాత్రయితే పదుల సంఖ్యలో భారీ యంత్రాలు జిల్లా భూభాగంలో తవ్వడం నిత్యకృత్యమైంది.

ఈ క్రమం లో బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నేతృత్వం లోని కోటగిరి, వర్ని, రెంజల్‌ మండలాల తహసీల్దా ర్లు, డీటీలు, వీఆర్‌ఓలు సుమారు 30 మందితో కూడిన బృందం మంగళవారం తెల్లవారుజామున నదిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్వారీల నిర్వాహకులు జిల్లా భూభాగంలో ఇసుక తవ్వుతుండగా, నాలుగు జేసీబీలు, డోజర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు.. నది ఒడ్డు వరకు తెచ్చారు. వెంటనే మహారాష్ట్ర క్వారీ నిర్వాహకులు 50 మంది వరకు వచ్చి అధికారుల బృందంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది సాయినాథ్‌ తలకు గాయాలయ్యాయి.

ఈ మేరకు రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దెగ్లూర్‌కు వెళ్లి క్వారీ కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకుంటామని కోటగిరి ఎస్‌ఐ రాజ్‌భరత్‌ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఈసారి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేవలం రెవెన్యూ అధికారులే ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

ఏటా కొనసాగుతున్న తంతు
మహారాష్ట్ర క్వారీల అనుమతుల పేరుతో జిల్లా భూభాగంలోని ఇసుక వనరులను దోచేయడం ఏటా పరిపాటిగా మారింది. జిల్లా అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేయడం, కేసు నమోదు చేయడంతో సరిపెడుతున్నారు. గతేడాది మహారాష్ట్ర కాంట్రాక్టర్‌లు తెలంగాణ భూభాగం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి, యంత్రాలను సీజ్‌ చేశారు. తాజాగా మహారాష్ట్ర క్వారీల నిర్వాహకులు జిల్లా అధికారులపైనే దాడికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.

మరిన్ని వార్తలు