కంచే గంధం మేసింది..

11 Mar, 2015 04:30 IST|Sakshi
కంచే గంధం మేసింది..

ఇందిరాపార్కులో గంధపు దుంగల అపహరణ

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తోటమాలి

కవాడిగూడ: ఇందిరా పార్కులో కొన్నేళ్లుగా యదేచ్ఛగా సాగుతున్న గంధపు దుంగల దొంగతనం బట్టబయలైంది. పార్కులో పనిచేసే ఓ ఉద్యోగి కాషాయ వస్త్రాలు ధరించి దుంగలను తరలిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. ఇందిరాపార్కులో సుమారు 250కి పైగా గంధపు చెట్లు సహజంగా మొలిచాయి. పార్కు అధికారులు ఈ చెట్లకు ప్రత్యేక నంబర్లను వేసి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రిజిస్ట్రర్ కూడా ఉంది. కానీ దాన్ని సక్రమంగా నిర్వహించడం లేదు. రెండేళ్ల క్రితం పార్కులోని గంధం చెట్లను నరుకుతుండగా ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. మంగళవారం నరికిన గంధపు దుంగలను స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి తరలిస్తుండగా సెక్యూరిటీ గార్డులు పట్టుకుని షాక్ తిన్నారు.

సదరు వ్యక్తి పార్కులో తోటమాలిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి భద్రయ్య. ఇతనికి పార్కులోని క్యాంటీన్‌లో పనిచేసే ఓ యువకుడు సహకరిస్తున్నాడు. గంధపు దుంగలను క్యాంటీన్‌లోనే భద్రపరచి అనంతరం బయటకు తరలిస్తున్నారు. పార్కులో గంధపు చెట్ల నరికివేతలోను, కొమ్మలు మాయం చేయడంలోను పార్కు అధికారుల అందండలపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం దొరికిన దుంగలు కాల్చిన చెట్ల నుంచి నరికినట్టు ఉండడంతో.. గత 15 రోజుల్లో రెండు సార్లు పార్కులో చెలరేగిన మంటలు ఉద్దేశ పూర్వకంగానే జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఇందిరాపార్కు ఉద్యానవన అధికారి శ్రీధర్‌ను వివరణ కోరగా గంధం దుంగల తరలింపుపై గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు