ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుధ్యం

25 Jun, 2017 01:32 IST|Sakshi
ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుధ్యం
- వ్యర్థాల నిర్వహణపై జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్‌ 
పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి
చెత్త తరలింపు, నిర్వహణలో ప్రైవేట్‌ సహకారం అవసరం
 
సాక్షి, హైదరాబాద్‌: వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతోనే అవి విజయవంతం అవుతాయని మునిసిపల్‌ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇంటి నుంచే శుభ్రత కార్యక్రమాలు అమలు కావాలని, ప్రజల వైఖరిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని దాదాపు మూడు, నాలుగు వేల పాఠశాలల్లో పెద్దసైజు చెత్త డబ్బాలు ఏర్పాటు చేసి చిన్నారులకు ప్రాథమిక విద్యస్థాయి నుంచే తడి, పొడిపై అవగాహన కల్పించాలని జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్‌లను ఆదేశించారు. శనివారం ఇక్కడి తాజ్‌ కృష్ణాలో ‘ఈ లీట్స్‌’సహకారంతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై జరిగిన జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ప్రతి పౌరుడూ నా నగరం , నా ప్రాంతం అనుకొని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలని కోరారు. అమెరికా, సింగపూర్‌లలో ఉండి వచ్చినవారు ఇక్కడకు రాగానే ‘చల్తా హై’అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను చైతన్యపరచడంతోపాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. చెత్తను వేరు చేయడం, తరలించడం, నిర్వహణ చేపట్టడంలో ప్రైవేటు సహకారం అవసరమని కేటీఆర్‌ అన్నారు. వ్యర్థాల నిర్వహణను మరింత వికేంద్రీకరిం చడంతోపాటు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 
 
గ్లామర్‌లేని పని..
చెత్త నిర్వహణ అనేది అన్‌గ్లామరస్‌ అని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. మునిసిపల్‌ అధికారులు కొత్త రోడ్లు, వంతెనలు వంటి వాటిపై చూపిన శ్రద్ధ నిర్వహణ పనులపై చూపడంలేదని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోని ఏ కార్పొరేషన్‌లో లేనివిధంగా జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, పువ్వాడ అజయ్‌కుమార్, మునిసిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు