ఇర్ఫాన్ అయ్యాడు శంకర్!

2 Oct, 2015 00:42 IST|Sakshi
ఇర్ఫాన్ అయ్యాడు శంకర్!

హైదరాబాదీ పేరుతో బెంగళూరు వాసి ఎత్తుగడ
ఐదేళ్లుగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగం
ఇంటర్వ్యూకు వెళ్లి వేరే వారి సర్టిఫికెట్లు చోరీ
గుట్టురట్టు చేసి  ‘బ్యాంకు రుణం’ దరఖాస్తు

 
సిటీబ్యూరో: సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చేరే కనీస అర్హత లేని ఇర్ఫాన్ అనే ఓ వ్యక్తి ప్రముఖ సంస్థలో రవి శంకర్ శర్మ పేరుతో క్వాలిటీ మేనేజర్‌గా మారాడు. అదెలా సాధ్యమైంది? చివరకు ఏ రకంగా గుట్టురట్టైంది?  బెంగళూరులో జరిగిన ఈ వ్యవహారంతో అసలు మన నగరానికి సంబంధం ఏమిటి..? ఈ ప్రశ్నలకు జవాబులతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

 గోవా నుంచి వచ్చి బెంగళూరులో...
 బెంగళూరు ఆర్టీ నగర్ పరిధిలోని గంగానగర్‌లో నివసిస్తున్న మహ్మద్ ఇర్ఫాన్ స్వస్థలం గోవా. పదో తరగతి పూర్తయ్యాక డిప్లమో కోర్సులో చేరిన ఇతగాడు ఆర్థిక కారణాలతో డ్రాప్‌ఔట్‌గా మారాడు. బతుకుతెరువు కోసం తన తల్లితో కలిసి కర్ణాటకకు వలస వచ్చి బెం గళూరులో స్థిరపడ్డాడు. పూర్తై పదో తరగతి, పూర్తి కాని డిప్లమోకు సంబంధిం చిన సర్టిఫికెట్లతో బెంగళూరులో ఉద్యోగ వేట ప్రారంభించాడు. కనీస విద్యార్హతలు లేకపోవడంతో సుదీర్ఘకాలం ప్రయత్నించినా ఎక్కడా ప్లేస్‌మెంట్ లభించలేదు. అయినా ఇంటర్వ్యూలకు వెళ్లడం మాత్రం మానుకోలేదు.

 సర్టిఫికెట్లు తస్కరించి  రవి శంకర్‌గా..
 హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉన్నతోద్యోగం చేస్తున్న రవి శంకర్ శర్మ 2008లో బెంగళూరులో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇదే ఇం టర్వ్యూకు వచ్చిన ఇర్ఫాన్.. రవి శంకర్‌తో మాటలు కలిపాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి బయటకు వెళ్లినప్పుడు అదును చూసుకుని శంకర్‌కు చెందిన సర్టిఫికెట్లు, ఇతర యోగ్యతా పత్రాలను ఇర్ఫాన్ తస్కరించాడు. తిరిగి వచ్చిన రవి శంకర్ ఆయా విద్యా సంస్థల నుంచి డూప్లికేట్ పత్రాలు తీసుకున్నారు. శంకర్ పత్రాలను తస్కరించిన ఇర్ఫాన్ వాటిపై తన ఫొటోలను పెట్టి ఫోర్జరీ పత్రాలు రూపొందించాడు. వీటి ఆధారంగా తన పేరు రవి శంకర్ శర్మ అంటూ 2010లో బెంగళూరులోని ఎంఫసిస్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తరవాత మరో ప్రముఖ సంస్థ కన్వర్‌గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్‌లో క్వాలిటీ మేనేజర్‌గా చేరాడు.
 
సీఐబీఐఎల్ డేటాబేస్ ఆధారంగా...

 తన పేరిట మరెవరో క్రెడిట్‌కార్డులు, బ్యాంకు రుణం తీసుకున్నారని గుర్తిం చిన రవి శంకర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సీఐబీఐఎల్)ను ఆశ్రయించారు. బ్యాంకు రుణాల డిఫాల్టర్ల డేటాబేస్‌ను పర్యవేక్షించే ఈ సంస్థ బెంగళూరులో రుణం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని బాధితుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు బెంగళూరులోని సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు రుణం, క్రెడిట్ కార్డుల చెల్లిం పులు కన్వర్‌గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఓ శాలరీ అకౌంట్ నుంచి జరిగినట్లు గుర్తించిన సీసీబీ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. దీంతో అతడు అన్ని విషయాలు బయటపెట్టడంతో గతనెల 14న అరెస్టు చేసింది. అసలు పేరుతో ఉన్న ఓటర్ ఐడీ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు