కరెన్సీ కొరత ఉంది

12 Dec, 2016 15:09 IST|Sakshi
బ్యాంకర్ల సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ శంతను ముఖర్జీ, మంత్రి ఈటల రాజేందర్

అంగీకరించిన ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ శంతను ముఖర్జీ
నోట్ల రద్దు కారణంగా ఎన్నో అవస్థలు
వినియోగదారులను సంతృప్తిపరచలేక పోతున్నాం
ఆసరా పింఛన్లు పంపిణీ చేయలేని పరిస్థితి
చిన్న నోట్లు లేక ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్య
రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నోట్లు పంపాలని ఆర్బీఐకి ఈటల విజ్ఞప్తి
రైతులను కాల్చుకు తింటున్నారంటూ బ్యాంకర్లపై పోచారం ఆగ్రహం
వాడివేడిగా రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల సమావేశం

సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నేపథ్యంలో గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం వాడివేడిగా సాగింది. నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారని మంత్రులు, అధికారులు మండిపడ్డారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా రైతులను కాల్చుకు తింటున్నాయంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో తొలుత ఎస్‌బీహెచ్ ఎండీ, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ శంతను ముఖర్జీ మాట్లాడారు.

‘‘నోట్ల రద్దుతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. కానీ నగదు అవసరమైనంత లేకపోవడంతో వినియోగదారులను సంతృప్తి పరచలేకపోతున్నాం. ఆసరా పింఛన్‌దారులకు రూ. వెరుు్య చొప్పున ఇవ్వాల్సి ఉంది. కానీ చిన్న నోట్లు అందుబాటులో లేవు. పోస్టాఫీసుల్లో ఇదో సమస్యగా మారింది..’’అని ఆయన పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ వ్యవస్థలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాల నేపథ్యంలో వాటికి లీడ్ బ్యాంక్ మేనేజర్లను గుర్తించామన్నారు.

 రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు: మంత్రి పోచారం
ఈ ఏడాది ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకులు కేవలం 22.5 లక్షల మందికే ఇచ్చాయని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రూ.లక్షలోపు రుణాలు తీసుకునే రైతుల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా.. చాలా బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేశాయన్నారు. ఎంతో కొంత మెరుగ్గా ఆంధ్రా బ్యాంకు రైతులకు రుణాలు ఇచ్చిందని, సిండికేట్ బ్యాంకు మాత్రం దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు.

సిండికేట్ బ్యాంకువారు తెలంగాణలో ఉన్నామనుకుంటున్నారా, మరెక్కడో ఉన్నామనుకుంటున్నారా అని నిలదీశారు. బ్యాంకుల తీరుతో అనేకమంది రైతులు భయపడి ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకర్లు సహకరించబోమంటే మిగతా రుణమాఫీ సొమ్మును నేరుగా రైతులకే ఇస్తామన్నారు. మూడో వారుుదాలో భాగంగా రూ.2,020 కోట్లు బ్యాంకులకు ఇచ్చినా.. కొన్ని బ్యాంకులు ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. బ్యాంకులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయని, ఇది దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

5 వేల కోట్ల చిన్న నోట్లు ఇవ్వండి: ఈటల
దేశంలో 86 శాతం కరెన్సీ రూ.500, రూ.వెరుు్య నోట్లేనని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదుతోనే లావాదేవీలన్నీ జరుగుతాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కూలీలకు నగదు లేక లావాదేవీలన్నీ నిలిచిపోయాయని.. అడ్డాకూలీల బతుకు ఛిద్రమైందని చెప్పారు. నగదు లేకపోవడంతో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ. 2 వేల నోటు చలామణీ కావాలంటే కొత్త రూ.500, రూ.100 నోట్లు అవసరమని స్పష్టం చేశారు.

వారుుదాల ప్రకారం అరుునా సరే రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల విలువైన రూ.500, రూ.100 నోట్లు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రస్తుతం విడుదల చేసిన సొమ్ము టిఫిన్ ఖర్చులకు కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని... డబ్బులు విడుదల చేసినా వారి చేతికి నగదు చేరలేదన్నారు. ఇక ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేసిందని, అర్హులకే అది అందేలా జాగ్రత్త పడాలని బ్యాంకర్లకు సూచించారు. నోట్ల రద్దుతో నష్టపోరుున పరిశ్రమలు, వ్యా పారులకు ప్రయోజనాలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రెండు మూడు రోజుల్లో  నగదు సరఫరా: ఆర్‌ఎన్ దాస్
నోట్ల రద్దు పరిణామాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని.. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి నగదు అందుతుందని రిజర్వుబ్యాంకు ప్రాంతీయ డెరైక్టర్ ఆర్‌ఎన్ దాస్ చెప్పారు. అరుుతే రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు మారాల్సిన ప్రాముఖ్యత ఉందని... డిజిటల్, ఎలక్ట్రానిక్ నగదు రహిత వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నగదు రహిత డిజిటల్ ఎకానమీ వైపు ప్రజలు మరలేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సూచించారు.

మరిన్ని వార్తలు