శరత్ చంద్రారెడ్డికి ఊరట

21 Apr, 2016 04:11 IST|Sakshi
శరత్ చంద్రారెడ్డికి ఊరట

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు.. హైకోర్టు ఉత్తర్వులు
‘హెటిరో’ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డికి కూడా దక్కిన ఊరట

 సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ‘ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్’ ఎండీ శరత్‌చంద్రారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌కు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. అందులో శరత్‌చంద్రారెడ్డిని నిందితుడిగా చేరుస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శరత్‌చంద్రారెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. శరత్‌చంద్రారెడ్డి.. అరబిందో, ట్రైడెంట్, యాక్సిస్ క్లినికల్స్‌లతోపాటు మొత్తం 9 కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉన్నారన్నారు. ఈ కంపెనీలకు పలు దేశాల్లో అనుబంధ కంపెనీలున్నాయని, అక్కడికి అధికారిక కార్యక్రమాల నిమిత్తం తరచూ వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి శుక్రవారం కోర్టు ముందు హాజరు కావడం ఇబ్బందిగా ఉందని కోర్టుకు నివేదించారు. 2012 మే 28 నుంచి ఇప్పటివరకు సీబీఐ కోర్టులో కేసు విచారణ 85 సార్లు వాయిదా పడిందని తెలిపారు. విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యక్తిగత హాజరు నుంచి శరత్‌చంద్రారెడ్డికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

హెటిరోపై విచారణ ప్రక్రియ నిలిపివేత
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి హెటిరో కంపెనీ, ఆ సంస్థ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిలపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హెటిరో శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పెట్టుబడుల నిర్ణయాన్ని కంపెనీ డెరైక్టర్‌గా తీసుకున్నారే తప్ప వ్యక్తిగతంగా కాదని శ్రీనివాసరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత హాజరు నుంచి శ్రీనివాసరెడ్డికి మినహాయింపునివ్వడంతోపాటు ఆయనకు సంబంధించి సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్ 14కు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు