సర్దార్ ఓ గొప్ప ఫీలింగ్

16 Apr, 2016 15:55 IST|Sakshi
సర్దార్ ఓ గొప్ప ఫీలింగ్

సిటీలో చాలామంది డీజేలున్నా.. వారెవరికీ దక్కని అవకాశం పిన్న వయస్కుడైన డీజేగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పాపులరైన పృథ్వికి దక్కింది. పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా కోసం ఒక పాటను రీమిక్స్ చేయడం... పవన్ పాడిన బీట్ సాంగ్‌కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడం... ఆ సినిమాలో డీజేగా కాసేపు కనిపించడం... లాంటి అరుదైన అవకాశాలను తన ఖాతాలో వేసుకున్నారీ కుర్ర డీజే. పృథ్వి ‘సాక్షి’తో పంచుకున్న తన సినిమా అనుభవం ఆయన మాటల్లోనే...    - ఎస్.సత్యబాబు


ఓ రోజు రాత్రి ఆర్టిస్ట్ మేనేజర్ అహ్మద్ నుంచి ఫోన్ కాల్.. ‘సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఒక పాట మిక్సింగ్ కోసం నిన్ను కావాలనుకుంటున్నారు. పొద్దున్నే వచ్చి కలవండి’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నా ఫేవరెట్ స్టార్‌ను కలవడమే కాదు.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశమూ దక్కింది.

 
హెల్ప్ చేస్తావా..?

అంత పెద్ద స్టార్ నాకు కబురు పెట్టడమే గొప్ప. అంతేకాకుండా ‘నాకు హెల్ప్ చేస్తావా..?’ అని అడగడంతో నా ఆశ్చర్యానందాలకు అవధుల్లేవు. మహదానందంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించాను. గబ్బర్‌సింగ్ సినిమాలో అంత్యాక్షరి లాగానే ఇందులో పలు హిట్ సాంగ్స్‌ను ఏర్చి కూర్చి ఒకే పాటలా మిక్స్ చే సిన సాంగ్ చూసే ఉంటారు. ఆ మిక్సింగ్ వర్క్ నాకు అప్పగించారు. డీజేగా రెగ్యులర్‌గా చేసే పని, పైగా నా అభిమాన హీరో కోసం చేస్తున్నాననే సంతోషం.. నాతో మరింత ఉత్సాహంగా పని చేయించింది. మిక్స్‌డ్ ట్రాక్స్‌తో మేళవించిన పాటలో కమెడియన్స్‌తో పాటు నేనూ తెరమీద కనిపిస్తాను. పవన్ అన్నయ్యకు నా వర్క్ చాలా బాగా నచ్చింది. అందుకే అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా.. తరహాలో సర్దార్‌లో తాను స్వయంగా పాడిన పోతురాజు బీట్ సాంగ్‌కి మ్యూజిక్ చేసే అవకాశమిచ్చారు.

 
మరిచిపోలేని జ్ఞాపకం...

సిటీలో డీజేలు ఇంత మంది ఉన్నా... అంత పెద్ద సినిమాలో పిలిచి ఛాన్స్ ఇవ్వడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. పవన్ అన్నయ్యతో దాదాపు 20 రోజులు కలిసి ఉండే గొప్ప అదృష్టం కలిగిందీ సినిమాతో. గతంలో నేను ఆయన పాటల్ని రీమిక్స్ చేసి ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాను. అయితే ఇప్పుడు ఆయన నా దృష్టిలో మరింత గొప్ప స్థానం దక్కించుకున్నారు. అందుకే మరోసారి పవర్ స్టార్ పాటల రీమిక్స్ మరింత అద్భుతంగా రూపొందించాలని అనుకుంటున్నాను.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా