నిబంధనలు తూచ్!

24 Nov, 2014 00:15 IST|Sakshi

* సర్కార్‌పై ప్రజాప్రతినిధుల ఒత్తిడి
* దుర్గం చెరువు నుంచి నీరు విడుదల
* మల్కం చెరువుకు తప్పని ముప్పు

గచ్చిబౌలి: రాష్ట్రంలోని అన్ని చెరువులను కాపాడుతాం.. ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తాం.. పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండేలా చూస్తాం.. చుక్క నీరు బయటకు వదలొద్దు.. ఇలా ఆర్భాటపు ప్రకటనలు చేసిన సర్కార్... ఒత్తిళ్లకు తలొగ్గింది. నగరంలో ప్రతిష్టాత్మకమైన దుర్గం చెరువు నుంచి నీటిని విడుదల చేసేందుకు అనుమతిచ్చేసింది. ఈ నేపథ్యంలో శనివారం నీటిని విడుదల చేయడంతో మల్కం చెరువు ముప్పు ముంగిట నిలిచింది.
 
వాస్తవ పరిస్థితి ఇదీ...
దుర్గం చెరువు 160 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎఫ్‌టీఎల్‌లోని దాదాపు 30 ఎకరాల స్థలంలో నిర్మాణాలు వెలిశాయి. ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో ఉన్న నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కళ్లు మూసుకొని నిర్మాణాలకు అనుమతులిచ్చేసింది. దుర్గం చెరువు తూములు తెరచి ఉండటంతో భారీ వర్షం వచ్చినా పెద్దగా నీటి ప్రభావం ఉండేది కాదు. తాజాగా ఎఫ్‌టీఎల్‌ను పాటించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇనార్బిట్ మాల్, మహేజా మైండ్‌స్పేస్, కావూరీ హిల్స్ నుంచి రోజుకు 45 మిలియన్ లీటర్ల మురికి నీరు దుర్గం చెరువులో కలుస్తోంది. కేవలం 5 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే ఎస్‌టీపీ అందుబాటులో ఉంది.

తూములు మూసివేయడంతో మురుగు నీటితో చెరువు నిండిపోయింది. మరో రెండు అడుగుల నీరు చేరితే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుంది. అది జరిగితే ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలలోకి భారీగా నీరు చేరేది. కావూరి హిల్స్ నుంచి నెక్టార్ గార్డెన్ మీదుగా ఇనార్బిట్ మాల్‌కు వెళ్లే రోడ్డు వరకు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో చాలా మంది ప్రముఖలు ఉంటున్నారు. ‘‘ఇప్పటికే మురుగునీటితో ఇబ్బంది పడుతున్నాం.. ఇక చెరువు నిండితే మా పరిస్థితి అంతే’’ అంటూ వారు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిళ్లు తీసుకు వచ్చారు. చెరువు తూము తెరచి నీటిని వదిలేయాల్సిందేనని పట్టుబట్టారు. తలొగ్గిన ప్రభుత్వం తూములను తెరిచేందుకు పచ్చజెండా ఊపేసింది.

ముప్పు ముంగిట మల్కం చెరువు
దుర్గం చెరువులోని మురుగు నీరు మల్కం చెరువులోకి చేరనుంది. వర్షం నీటితో ఉన్న ఈ చెరువు కలుషితం కానుంది. కొంత మంది స్వార్థానికి ఈ చెరువుకు ముప్పువాటిల్లనుంది.

>
మరిన్ని వార్తలు