సత్యం కేసులో రామలింగరాజు దోషిగా నిర్థారణ

9 Apr, 2015 11:18 IST|Sakshi

హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి తీర్పు ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంస్థ చైర్మన్ రామలింగరాజును న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.  

రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్‌ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలంపై నేరం రుజువైంది. దీంతో  వీరికి ఏడు నుంచి పదేళ్లపాటు శిక్ష పడే అవకాశ ఉంది.  2009 జనవరిలో  సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కేసులో

ఈ కుంభకోణంలో రూ.14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477ఎ (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద సీబీఐ అభియోగాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు మొత్తం 226 మంది సాక్ష్యులను విచారించగా, సీబీఐ సమర్పించిన 3,037 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది.  కాగా సత్యం కుంభకోణంపై  ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది.
 
ఈ కేసు ముఖ్యాంశాలు....
2009 జనవరి 7: సత్యం కంప్యూటర్స్‌లో 7,100 కోట్లు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. తాను పులి మీద స్వారీ చేస్తున్నట్లు వెల్లడించారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ షేర్‌హోల్డర్లకు లేఖ రాశారు.
 
జనవరి 9: రామలింగరాజు మోసం చేశారని నగరానికి చెందిన లీలామంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
జనవరి 9: ఈ కేసులో విచారణ మరింత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు.
 
జనవరి 11: రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
 
ఫిబ్రవరి 14: కేసు విచారణకు సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లెయినరీ ఇన్వెస్టిగేషన్ టీం (ఎండీఐటీ) ఏర్పాటు.
 
ఏప్రిల్ 7: సీబీఐ కోర్టుకు ప్రధాన చార్జిషీట్‌ను సమర్పించింది.

మరిన్ని వార్తలు