సౌదీ టు ముంబై వయా హైదరాబాద్‌

16 Jan, 2017 00:32 IST|Sakshi
సౌదీ టు ముంబై వయా హైదరాబాద్‌
  • బంగారం స్మగ్లింగ్‌ గుట్టురట్టు చేసిన శంషాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు  l
  • ‘రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌’ ద్వారా తీసుకొచ్చిన క్యారియర్‌
  • సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్‌ నుంచి ముంబై చేరుతున్న బంగారం అక్రమ రవాణా గుట్టును శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు రట్టు చేశారు. నిఘాకు చిక్కకుండా స్మగ్లర్లు అనుసరిస్తున్న ఈ విధానంపై కొంతకాలంగా కన్నేసిన అధికారులు ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సహకారంతో (ఏఐయూ) చెక్‌ చెప్పారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్‌ మీదుగా ముంబై తరలించాలని ప్రయత్నించిన 1.19 కేజీల బంగారాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ముంబై వాసిని అరెస్టు చేసిన కస్టమ్స్‌ విభాగం దీని వెనుక ఉన్న వ్యవస్థీకృత ముఠా కోసం గాలిస్తోంది.

    అంతర్జాతీయంగా నడిచే విమానాలకే కస్టమ్స్‌ తనిఖీలు పక్కాగా ఉంటాయి. దీంతో ఇటీవల అక్రమ రవాణాదారులు తమ పంథా మార్చారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా, ఆపై డొమెస్టిక్‌గా మారిపోయే విమానాలను ఎంచుకుని వాటి ద్వారా రవాణా ప్రారంభించారు. ప్రధానంగా ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానాలే ఈ తరహాకు చెందినవి ఎక్కువగా ఉన్నాయి. స్మగ్లింగ్‌ ముఠా సభ్యులు ఆ విమానం ప్రారంభమయ్యే ప్రాంతంతో పాటు దేశీ సర్వీసుగా మారే ప్రాంతంలోనూ ముందే కాసుకుని ఉంటున్నారు. సాంకేతిక పరిభాషలో వీరే క్యారియర్లు. వీరు చిక్కినా... లింకు ముందుకు సాగడం కష్టం. దుబాయ్‌లో అసలు ఆదాయపు పన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్‌ అన్నదే ఉత్పన్నం కాదు.

    ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని పంపి, బంగారం కొని తీసుకువస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆదివారం చిక్కిన ముంబై వాసి తక్కువ కాలంలోనే జెడ్డా నుంచి తిరిగి వచ్చాడు. ఇతడు ప్రయాణించిన ఎయిర్‌ ఇండియా విమానం జెడ్డా నుంచి హైదరాబాద్‌ వరకు అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తుంది. ఆపై డొమెస్టిక్‌ సర్వీసుగా మారిపోయి ఇక్కడ నుంచి ముంబైకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే స్మగ్లర్లు దీన్ని ఎంచుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు చెప్తున్నారు. అత్యధిక శాతం స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్‌ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పౌడర్‌ డబ్బాలతో పాటు మొబైల్‌ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చే వారు. ఆ తరువాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చారు.

    తాజాగా రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌ జోరుగా సాగుతోందని ఆదివారం చిక్కిన ముంబై వాసి ఉదంతం బయటపెట్టింది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మల ద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నా రు. బంగారానికి నల్ల కార్బన్‌ పేపర్‌ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుం టున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడు తున్నారని ఆదివారం నాటి ఉదంతం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన కస్టమ్స్‌ అధికారులు సూత్రధారులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు