కాంట్రాక్టులు.. కమీషన్లేనా..!

22 May, 2016 03:00 IST|Sakshi
కాంట్రాక్టులు.. కమీషన్లేనా..!

కేబీఆర్ పార్కు పరిరక్షణ పట్టదా?
ఎస్‌ఆర్‌డీపీ వద్దు ‘సేవ్ కేబీఆర్ పార్క్’
సదస్సులో వక్తలు

సోమాజిగూడ: అనాలోచితమైన విధానాలు, లోపభూయిష్టమైన అభివృద్ధి పథకాలు,  కోట్లాది రూపాయల ప్రజాధనం  వృథా చేస్తూ   పర్యావరణానికి తూట్లు  పొడిచే విధానాలను ప్రభుత్వం అవలంబి స్తోందని  పలువురు పర్యావరణవేత్తలు ఆభిప్రాయపడ్డారు. ఎస్‌ఆర్‌డిపీ (స్ట్రాటజిక్ రోడ్ డవలప్‌మెంట్ ప్లాన్) పథకాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజ లు, నిపుణుల అభిప్రాయలు  స్వీకరించి శాస్త్రీయ, పర్యావరణ ప్రియమైన విధానాలతో  ట్రాఫిక్  సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.  హైదరాబాద్ రైజింగ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బేగంపేట సెస్ భవన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ కేబీఆర్ పార్క్ ’ సదస్సులో  మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పట్టణీకరణ నిపుణురాలు కరుణాగోపాల్, అనంత్ మరింగంటి తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డిపీ నిర్మాణ పథకాలను తీవ్రంగా తప్పు పట్టారు.

  నగరానికి ఆత్మలాంటి ఉద్యానవనాలు,  చెరువులను కాపాడుకోవాలన్నారు. చార్మినార్, మక్కామజీద్ లాంటి హెరిటేజ్ భవనాలను పక్కన పెట్టి హైటెక్ భవనాలను చూపుతూ హైదరాబాద్ నగర ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తక్కువ చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి తక్కువ  ఖర్చుతో చక్కటి ప్రత్యామ్నాయాలు ఉండగా భారీ ఖర్చు, పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఫ్లైఓవర్ల నిర్మా ణం ఎందుకని ప్రశ్నించారు.  కేబీఆర్ పార్క్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో నిర్మించే ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని లేకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

భారీ కాంట్రాక్ట్‌లు, కమీషన్ల మోజుతో నిర్మించే ఇలాంటి ప్రాజెక్ట్‌లు భవిష్యత్‌లో గుదిబండగా మారుతాయని , జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం కేబీఆర్ పార్క్ వద్ద భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో హైదరాబాద్ రైజింగ్ సంస్థ  ప్రతినిధి శిల్పా శివరామన్‌తోపాటు పలువురు పర్యావరణప్రియులు పాల్గొన్నారు.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు
ఉచిత పథకాలతో అమాయక ఓటర్లను బుట్టలోవేసుకుంటున్న పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.  కమీషన్లకు కక్కుర్తి పడుతూ పనికిమాలిన పథకాలు ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన నిర్ణయాలు, ప్రాజెక్ట్‌లతో పాలకులు మందుకు వెళుతుంటే మన పాలకులు మాత్రం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ లాబీల ప్రయోజనాల మేరకు పనిచేస్తూ విధ్వంసం చేస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీ  కార్యక్రమానికి వ్యతిరేకంగా పర్యావరణవాదులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ప్రాజెక్ట్ నిలిపివేసే వరకు కలిసికట్టుగా పోరాడదాం. -   మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాజీ వైస్ చైర్మన్, ఎన్‌డీఎంఏ

 కేబీఆర్ పార్క్ సిటీకి ఆక్సిజన్
నగరానికి కేబీఆర్ పార్క్ ఒక మణిహారం లాంటిది.  ఒక ఆక్సిజన్ మాస్క్. ఇలాంటి పార్క్‌కు ఎస్‌ఆర్‌డీపీతో తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వాలు  కార్పొరేట్ ప్రయోజనాల మేరకు పనిచేస్తూ కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి జీవితాలను పణంగా పెడుతున్నారు.  కాలుష్యంతో సతమతమవుతున్న నగరాలలో ఉన్న అతికొద్ది పార్కులను కూడా ధ్వంసం చేస్తున్నారు. దీంతో అవి నరకాలుగా మారుతున్నాయి. అర్థంపర్థం లేని పట్టణీకరణ మానవ విధ్వంసానికి దారి తీస్తుంది. కనీస అవసరాలు తీరక సామాన్యులు నానాపాట్లు పడుతుంటే ఫ్లై ఓవర్‌లు కావాలని ఎవరు అడిగారు...తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఉపసంహరించుకోవాలి.
-  ప్రొఫెసర్  పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త    

 ఫ్లై ఓవర్లు సర్వరోగ నివారిణి కాదు
నగరంలో కొన్ని ఫ్లైవోవర్‌లు నిర్మిస్తే అవి సర్వరోగ నివారిణి కాదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మెరుగుపరచడం, ఎంఎంటీఎస్ సమర్థ వినియోగం. కార్ పూలింగ్ ప్రొత్సహించడం, నగర వికేంద్రీకరణ ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కరించవచ్చు. ఎన్నో పక్షి జాతులు, పచ్చటి చెట్లతో నగరం నడిబొడ్డున కళకళలాడే కేబీఆర్ పార్క్‌ను అందరం కాపాడుకోవాలి. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులో సహజ సౌందర్యంతో ఉండే పార్క్ మొత్తం నగరానికి ఆక్సిజన్ మాస్క్ లాంటిది. - అనంత్ మరింగంటి , హైదరాబాద్ అర్బన్‌ల్యాబ్స్ డెరైక్టర్

 వేల కోట్లు వృథా చేస్తున్నారు
ప్రపంచవ్యాప్తంగా  ఫ్లైఓవర్లు నిర్మించడం మానేశారు. ఇది పాత పద్ధతి. బెంగళూర్, మైసూర్  మధ్య కనెక్టివిటీ పెంచే ఉద్దేశ్యంతో కర్ణాటక ప్రభుత్వం 1998లో ప్రారంభించిన నైస్ ప్రాజెక్ట్ సుదీర్ఘంగా సాగి కొద్దికాలం క్రితమే పూర్తయింది. ఇన్‌ఫ్రా సైకిల్, పొలిటికల్ సైకిల్ వేరువేరు. తరచూ అధికారం చేతులు మారే ప్రజాస్వామంలో కొత్త పార్టీ రాగానే పాత ప్రాజెక్టులు పక్కన పడేస్తున్నారు. దీంతో వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది.  శాశ్వత ప్రాతిపదికన పర్యావరణహితమైన ప్రాజెక్టులు మాత్రమే మనుగడ సాగిస్తాయి.   
-  కరుణాగోపాల్,  ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్  వ్యవస్థాపకురాలు

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా