పైసల్లేవు.. పరి‘శ్రమే’ మిగిలింది!

2 Aug, 2017 02:22 IST|Sakshi
పైసల్లేవు.. పరి‘శ్రమే’ మిగిలింది!
‘టీ–ప్రైడ్‌’కు నిధుల జాడ్యం
మంజూరై రెండేళ్లయినా విడుదల కాని పెట్టుబడి రాయితీలు
 
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు
రూ.262 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు
నిరర్థక ఆస్తులుగా మారుతున్న పెట్టుబడి రుణాలు
రుణాలు తీర్చాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు
సంక్షోభంలో ఎస్సీ, ఎస్టీల పరిశ్రమలు!
 
ఓ దళిత మెకానికల్‌ డిప్లొమా ఇంజనీర్‌ హైదరాబాద్‌లోని బాలానగర్‌ పారిశ్రామికవాడలో ‘టీ–ప్రైడ్‌’ పథకం కింద రూ.కోటి పెట్టుబడితో సీఎన్‌సీ మౌల్డింగ్‌ మెషీన్‌ పరిశ్రమను ఏర్పాటు చేశారు. బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, డీఆర్‌డీఎల్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వర్క్‌ ఆర్డర్లు కూడా వచ్చాయి. అయితే ఆయా సంస్థలు ఆరు నెలలకోసారి బిల్లులు చెల్లిస్తుంటాయి. దీంతో పరిశ్రమ నిర్వహణ కష్టతరంగా మారింది. పెట్టుబడి కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణ వాయిదాలు చెల్లించలేక.. ఉత్పత్తి కొనసాగించేందుకు కావాల్సిన నిధుల్లేక ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి రాయితీ నిధులు వస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు. బ్యాంకులు ఈ పరిశ్రమకు ఇచ్చిన రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా లెక్కగట్టి.. మొత్తం రుణం కట్టేయాలంటూ నోటీసులిచ్చాయి. దీంతో పరిశ్రమ సంక్షోభంలో పడింది. ‘టీ–ప్రైడ్‌’అమల్లో జాప్యం కారణంగా ఇలా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు.
 
సాక్షి, హైదరాబాద్‌: దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీ–ప్రైడ్‌’కార్యక్రమం ఆచరణలో విఫలమవుతోంది. పరిశ్రమలు స్థాపించిన వెంటనే రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తే పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉండగా... దరఖాస్తు చేసుకుని రెండేళ్లయినా పెట్టుబడి రాయితీ అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకుల వడ్డీలు పెరిగి పెట్టుబడి రుణాలు భారంగా మారుతున్నాయి. ఉత్పత్తుల విక్రయాల బిల్లులు సకాలంలో అందక పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోంది.
 
తీవ్ర జాప్యం.. అరకొరగా నిధులు..
రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీ ప్రతి మూడు నెలలకోసారి, జిల్లా స్థాయి కమిటీలు నెలకోసారి సమావేశమై ‘టీ–ప్రైడ్‌’ పథకం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీలను మంజూరు చేయాలి. కానీ సమావేశాలు జరిగి ఏడాదిన్నర, రెండేళ్ల తర్వాత కూడా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీలు విడుదల కావడం లేదు. ఈ పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌ నిధులు కేటాయించినా.. విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2016–17లో ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం రూ.128 కోట్లు కేటాయించగా.. రూ.32 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. 96 కోట్లు కేటాయించగా.. రూ.24 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2017–18లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కలిపి రూ.218 కోట్లు కేటాయించగా.. ఏప్రిల్‌లో రూ.101 కోట్లు విడుదలయ్యాయి.
 
2016–17లో ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం  కేటాయించిన మొత్తం రూ. 128 కోట్లు
ఇందులో విడుదల చేసిన మొత్తం రూ. 32 కోట్లు
2016–17లో ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం  కేటాయించిన మొత్తం రూ. 96 కోట్లు
ఇందులో విడుదల చేసిన మొత్తం రూ. 24 కోట్లు
2017–18లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం  కేటాయించిన మొత్తం రూ. 218 కోట్లు 
ఇందులో ఏప్రిల్‌లో విడుదల చేసిన మొత్తం రూ. 101 కోట్లు
 
టీ– ప్రైడ్‌ పథకమిదీ..
సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు 2014 నవంబర్‌ 2న ‘తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ రాపిడ్‌ ఇన్‌క్యుబేషన్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రినియర్స్‌ ఇన్‌సెంటివ్స్‌ ప్రోగ్రామ్‌ (టీ–ప్రైడ్‌)’అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు గరిష్టంగా రూ.75 లక్షలకు మించకుండా పరిశ్రమలో 35 శాతం పెట్టుబడి రాయితీతోపాటు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో పెద్ద సంఖ్యలో ఎస్టీ, ఎస్టీలు పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారు.
 
రూ. 262 కోట్ల బకాయిలు
∙ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి.. 2016 ఏప్రిల్‌ 22 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎస్‌ఎల్‌సీ సమావేశాల్లో, 2016 ఆగస్టు 10 నుంచి ఇప్పటివరకు జరిగిన డీఎల్‌సీ సమావేశాల్లో మంజూరు చేసిన రూ.130 కోట్ల పెట్టుబడి రాయితీ నిధులను ఇంతవరకు చెల్లించలేదు. దాదాపు 2,500 మంది దళిత పారిశ్రామికవేత్తలు ఈ ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నారు.
∙ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి 2016 జనవరి 8 నుంచి ఎస్‌ఎల్‌సీ సమావేశాల్లో, 2015 ఆగస్టు 31 నుంచి జరిగిన డీఎల్‌సీ సమావేశాల్లో మంజూరు చేసిన రూ.132 కోట్ల నిధులను ఇంకా చెల్లించాల్సి ఉంది. సుమారు 2,500 మంది రాయితీ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు.
 
మూతపడేలా ఉన్నాయి
‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ–ప్రైడ్‌ కింద చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీలను ఆరు నెలలలోపు విడుదల చేయాలి. పెట్టుబడి రాయితీలు ఆలస్యంగా విడుదల చేస్తుండటంతో బ్యాంకు రుణాలు నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయి. పరిశ్రమలు మూతపడే పరిస్థితి తలెత్తుతోంది..’’
– రాహుల్‌ కిరణ్, డిక్కీ 
మరిన్ని వార్తలు