ఏడాదిగా విడుదలకాని వేతనాలు

12 Aug, 2016 03:23 IST|Sakshi

ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ ఉద్యోగులకు ఏడాది కాలంగా వేతనాలు విడుదల కావడంలేదు. ఉద్యోగుల ఇబ్బందుల దృష్ట్యా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆయా పథకాలు, ఇతరత్రా ఉన్న డబ్బు నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం మేనేజిరియల్ సబ్సిడీని చెల్లిస్తోంది. ఉద్యోగాల జీతా ల కోసం 2016-17లో మొత్తం రూ. 60 కోట్లు పొందుపరిచినా, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి రూ.15 కోట్లకు బీఆర్వోలు ఇచ్చినా అవి ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఆగస్టు కూడా సగం పూర్తయింది.

మందగించిన భూ పంపిణీ: ఈ ఆగస్టు 15తో దళితులకు భూ పంపిణీ పథకం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాది 3,400 మందికి  పదివేల ఎకరాల పంపిణీకి లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు 788 మందికి 2079 ఎకరాలను మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. రెండేళ్లల్లో 3,589 మందికి 9,446 ఎకరాలను పంపిణీ చేశారు. భూ అభివృద్ధి పథకం కింద పంటలకు సాగునీరు, కరెంట్, విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సౌకర్యాలను కల్పించాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో అందుతున్న దాఖలాలు లేవు. భూ పంపిణీ పథకం కోసం భూములను విక్రయిస్తామంటూ కొన్ని జిల్లాల్లో పలువురు రైతులు ఎస్సీ కార్పొరేషన్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే, కార్పొరేషన్‌కు డబ్బులు రాకపోవడంతో వాటిని తిరిగి రద్దు చేసుకున్నారు. స్వయం ఉపాధి పథకాలకు కూడా సకాలంలో రుణాలు విడుదల కావడంలేదు.

మరిన్ని వార్తలు