ఎస్సీ, ఎస్టీ నిధుల ముసాయిదా సిద్ధం

18 May, 2017 01:29 IST|Sakshi
ఎస్సీ, ఎస్టీ నిధుల ముసాయిదా సిద్ధం

- రూపొందించిన మంత్రుల కమిటీ
- ఒకట్రెండు రోజుల్లో సీఎం వద్దకు ఫైలు
- ఆమోదముద్ర పడగానే అమల్లోకి..
- అభివృద్ధి నిధి పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్‌


సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ స్థానంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాల అంశం కొలిక్కి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్‌ ఆధ్వర్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేÔశమయ్యాయి. సుదీర్ఘ చర్చలు జరిపిన ఈ కమిటీలు తాజాగా నిబంధనలు ఖరారు చేశాయి. ఏడు అంశాలతో రూపొందించిన ముసాయిదాను ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపేందుకు రంగం సిద్ధమైంది.

సీఎం ఆమోదం పొందగానే ప్రత్యేక అభివృద్ధి నిధి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గతంలో ఉన్న సబ్‌ప్లాన్‌ కంటే మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశారు. నిధి కింద చేసే ఖర్చుకు తగిన ఫలితాలు రావాలనే లక్ష్యంతో మంత్రుల కమిటీ కార్యచరణ రూపొం దించింది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ.. పలు పథకాలను నిర్దేశించింది. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక స్థితి, ఉపాధి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. అలాగే ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్‌ చేయాలని నిబంధనల్లో పేర్కొంది.

ఆరు నెలలకోసారి కౌన్సిల్‌ భేటీ..
ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు రాష్ట్రస్థాయిలో మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ ఆర్నెళ్లకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. వీటితోపాటు ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.

మంత్రుల కమిటీ సూచించిన ఏడు అంశాలివే..
► ఇతర వర్గాలు–ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
► జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలి
► ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వారి సామాజిక పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
► బడ్జెట్‌ తయారీ ప్రణాళికబద్ధంగా జరగాలి
► సకాలంలో ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్‌ చేయాలి
► రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కౌన్సిల్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలి
► జిల్లా స్థాయిలో నిఘా, పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలి

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు