ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ మార్గదర్శకాలు ఖరారు

14 Sep, 2017 03:46 IST|Sakshi
ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ మార్గదర్శకాలు ఖరారు
- ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌ 
- ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు.. 
 
సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్‌డీఎఫ్‌), షెడ్యూల్డ్‌ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్‌డీఎఫ్‌) మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రెండున్నర నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలుకు మోక్షం కలిగింది. ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుకు సంబంధించి మంత్రుల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదించారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమం అమలుతో పాటు నిఘాపైనా స్పష్టత రానుంది. ఎస్సీ, ఎస్టీలకోసం గతంలో ఉన్న ఉప ప్రణాళికను రద్దు చేస్తూ.. 2017– 18 వార్షిక సంవత్సరం నుంచి కొత్తగా ఎస్సీ ఎస్‌డీఎఫ్, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ను అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ నిధి కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, వినియోగం తదితర అంశాలపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభిృవృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది. దీంతో పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. నిధుల వినియోగంపైనా కఠిన నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా రూల్స్‌ ఫైలును సీఎం ఆమోదించడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వు లు వెలువర్చే అవకాశం ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 
 
త్వరలో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం
ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు కానుంది. వాస్తవానికి ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై క్షేత్రస్థాయిలో ఎస్‌డీఎఫ్‌ అమలు తీరును పర్యవేక్షించాలి. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావస్తున్నా మార్గదర్శకాలు రూపొందించకపోవడంతో కమిటీ ఏర్పాటు కాలేదు. త్వరలో మార్గదర్శకాలు వెలువడనుండటంతో కమిటీ ఏర్పాటుతో పాటు సమావేశం కూడా జరగనుందని అధికారులు చెబుతున్నారు.  
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు