జూన్‌ తొలి వారంలో స్కూల్‌ ఫీజుల నివేదిక!

20 May, 2017 00:15 IST|Sakshi
జూన్‌ తొలి వారంలో స్కూల్‌ ఫీజుల నివేదిక!

- నివేదిక సిద్ధం చేస్తున్న ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ
- హాస్టళ్లు, స్కూళ్లకు వేర్వేరు అకౌంట్లు నిర్వహించేలా చర్యలు
- స్కూళ్లవారీగా ఫీజులు..కనీస,గరిష్ట ఫీజుల విధానానికి నో


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా నివేదిక రూపొందించి, జూన్‌ మొదటి వారంలో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది. పాఠశాల వారీగా ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించేందుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. హాస్టల్‌ వసతి కలిగిన పాఠశాలల్లో నివాస వసతి కింద, ఫీజుల కింద వసూలు చేస్తున్న మొత్తం, సహపాఠ్య కార్యక్రమాలు కాకుండా ఇతర కార్యక్రమాల కింద వసూలు చేసే మొత్తాలకు వేర్వేరు అకౌంట్ల ను నిర్వహించేలా నిబంధనలను పొందుపరుస్తున్నట్లు సమాచారం.

జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు (డీఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా ఎవరిని నియమించాల న్న విషయంలో తర్జనభర్జన పడుతోంది. జిల్లా జడ్జి చైర్మన్‌గా ఉంటే బాగుంటుందా.. అయితే వారికి సమయం సరిపోతుందా, లేదా, అన్న ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ జడ్జిని డీఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా నియమిస్తే బాగుంటుందని భావిస్తోంది.  

కనీస, గరిష్ట ఫీజుల విధానం ఉండదు..
యాజమాన్యాలు కోరిన కనీస, గరిష్ట ఫీజుల విధానం ఉండే అవకాశం లేదు.  పాఠశాల ఆదాయ వ్యయాల ప్రకారమే ఫీజులను నిర్ణయించేలా సిఫారసు చేసే అవకాశం ఉంది.  ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతం టీచర్ల వేతనాల కు, 15 శాతం పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు, ఇంకో 15 శాతం పాఠశాల నిర్వహణకు, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమానికి వెచ్చించాలని, యాజమన్యాలు 5 శాతం డబ్బునే లాభంగా తీసుకోవాలనే జీవో–1 నిబంధనలు అమలు చేసేలా సిఫారసు చేసే అవకాశం ఉంది. యాజమాన్యాలు తీసుకునే 5 శాతం మొత్తాన్ని పెంచాలని, సంక్షేమానికి వెచ్చించాల్సిన 15 శాతంలో మార్పులు చేయాలని యాజమాన్యాలు కోరినా, ఆ దిశగా సిఫారసు ఉండే అవకాశం లేదు.

మరిన్ని వార్తలు