పరీక్ష ఫీజు కోసం స్కూల్ యాజమాన్యం ఒత్తిడి

15 Mar, 2014 00:51 IST|Sakshi

 బోయిన్‌పల్లి, న్యూస్‌లైన్: పరీక్ష ఫీజు కట్టాలని.. లేకపోతే మీ అబ్బాయికి హాల్‌టికెట్ ఇచ్చేది లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను హెచ్చరించింది. ఫీజు కట్టే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన భార్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు...పాతబోయిన్‌పల్లి డివిజన్ బృందావన్‌కాలనీలో నివాసముండే లక్ష్మి (32), వెంకన్న భార్యాభర్తలు. భర్త డ్రైవర్ కాగా..భార్య కూలీ పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె రాజేశ్వరి డిగ్రీ, చిన్నకుమార్తె రజని ఇంటర్ చదువుతుండగా... కుమారుడు ప్రదీప్ మల్లికార్జున కాలనీలోని ఎంకేఆర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ప్రదీప్ త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.కాగా, ప్రదీప్‌కు సంబంధించిన 10వ తరగతి పరీక్ష ఫీజును వెంటనే చెల్లించాలని తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. లేకపోతే హాల్ టికెట్ ఇచ్చేదిలేదని, పరీక్ష కూడా రాయనివ్వబోమని హెచ్చరించింది.
 
 గురువారం రాత్రి ప్రదీప్ పరీక్ష ఫీజు కట్టాలని లక్ష్మి భర్తను అడిగింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం.. డబ్బు ఎక్కడి నుంచి తేవాలని భర్త అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  దీంతో తీవ్రమనస్తాపానికి గురైన లక్ష్మి ఇంట్లోకెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆ ర్పి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు