కళకళ.. వెలవెల

13 Jun, 2014 03:13 IST|Sakshi
కళకళ.. వెలవెల

 సాక్షి, సిటీబ్యూరో: వేసవి ముగియడంతో నగరంలోని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ గురువారం పునఃప్రారంభమయ్యాయి. కొత్త దుస్తులు, పుస్తకాల బ్యాగులు తగిలించుకొని వచ్చిన విద్యార్థులతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కళకళలాడగా, సర్కారీ స్కూళ్లు మాత్రం విద్యార్థులు లేక బోసిపోయాయి. కొత్తగా చేరుతున్న చిన్నారులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట రావడంతో పలు ప్రైవేటు పాఠశాలలు కిటకిటలాడా యి.

 

ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు ఉపాధ్యాయులంతా వచ్చినప్పటికీ.. విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. సెలవులకు ఊళ్లకు వెళ్లిన విద్యార్థలు కొందరు తిరిగి రాకపోవడం, ఎండ తీవ్రత ఇంకా తగ్గకపోవడం కూడా కారణాలు కావచ్చని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే..జిల్లావ్యాప్తంగా ఏ పాఠశాల్లోనూ విద్యార్థులకు కనీసం ఒక్కజత యూనిఫారాన్ని కూడా విద్యాశాఖ అధికారు లు అందజేయలేదు. విద్యార్థులకు ఉచి త పాఠ్యపుస్తకాలను కూడా అరకొరగానే పంపిణీ చేశారు.
 
తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య
 సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏ యేటికాయేడు తీవ్రంగా పడిపోతోంది. అదేమీ లేదని అధికారులంటున్నప్పటికీ ఇది వాస్తవం. సాధారణంగా వేసవి సెలవుల్లో బడిబాట, విద్యా పక్షోత్సవాలు.. తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నమోదు ను పెంచుకోవటానికి విద్యాశాఖ కసరత్తు చేయ టం పరిపాటి. కానీ ఈసారి అలాంటి కార్యక్రమాలేవీ జరగకుండానే పుణ్యకాలం కాస్తా ముగిసిపోయింది.  విద్యాశాఖ అధికారులు వేసవి సెలవు ల షెడ్యూల్‌లో బడిఈడు బాలలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరం.
 
పాఠ్య పుస్తకాల కొరత!
 పాఠశాలల పునఃప్రారంమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదు. ప్రతిఏటా పాఠ్యపుస్తకాల కొరత విద్యార్థులను వేధిస్తున్నా..ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జూన్ 12నుంచి పాఠశాలలు తెరిచిన వెం టనే.. నగరంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ అధికారులు చే సిన ప్రకటనలు కాగితాలకే పరిమితయ్యాయి. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల్లో 65 శాతం పుస్తకాలు మాత్రమే పాఠశాలలకు చేరాయి. మిగిలిన 35 శాతం పుస్తకాలు స్కూళ్లకు ఎప్పుడొస్తాయో అంతుబట్టని దుస్థితి నెలకొంది. పుస్తకాలు ఇవ్వకుంటే విద్యార్థులు బడి రాకుండా పోయేందుకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
 
యూనిఫారాలు లే వ్ !
 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు సుస్పష్టంగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన యూనిఫారాల గురించి అటు ఆర్వీఎంలోనూ.. ఇటు విద్యాశాఖలో ఆ హడావిడేమీ కనిపించడం లేదు. హైదరాబాద్ జిల్లాలో 1.07లక్షలమందికి 2.14లక్షల జతలు సిద్ధం కావాల్సి ఉండగా..నేటివరకు ఒక్క జత కూడా రెడీ కాలేదని తెలిసింది. కనీసం కాంట్రాక్టర్ నుంచి బట్ట(క్లాత్)కూడా అందలేదు. కమీషన్లకు కక్కుర్తిపడిన ప్రభుత్వ పెద్దలు.. అధ్వాన్నపు కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడమే ఈ జాప్యానికి కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు