ఆయుధాల తయారీలో సైంటిస్టుల కృషి అమోఘం

2 Jul, 2013 04:43 IST|Sakshi
 మాదాపూర్, న్యూస్‌లైన్: ఆధునిక ఆయుధ సంపత్తి ఉత్పత్తిలో భారత్ కృషి ఎనలేనిదని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో ఏపీ చిన్నతరహా పారిశ్రామిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సాత్స్య సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రక్షణ పరికరాల తయారీలో శాస్త్రవేత్తలు మంచి కృషి చేస్తున్నారన్నారు. డీఆర్‌డీవోకు గొప్ప చరిత్ర ఉందని, యువ శాస్త్రవేత్తల ఆలోచనలు దేశాభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు.
 
నగరానికి మంచి పరిశ్రమలు వస్తున్నాయని, వారికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీవో కార్యక్రమాలకు చేయూతనందిస్తుందని, చిన్నతరహా పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రక్షణ శాస్త్ర సలహాదారుడు పద్మశ్రీ అవినాశ్ చందర్, అగ్ని డెరైక్టర్ వీజీ శేఖరన్, ఏఎస్‌ఎల్ డెరైక్టర్ జయరామన్, ఆర్‌సీఐ డెరైక్టర్ జి. సతీష్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాత్స్య ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సెక్రటరీ దేవినేని ప్రసాద్, జనరల్ సెక్రటరీ డి. శివరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు