వైద్య శాఖ ఆర్డీల అధికారాలకు కత్తెర!

4 Apr, 2016 00:57 IST|Sakshi
వైద్య శాఖ ఆర్డీల అధికారాలకు కత్తెర!

సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుల (ఆర్డీ) అధికారాలను కత్తిరించాలని ఆ శాఖ యోచిస్తోంది. అందులో భాగంగా వరంగల్, హైదరాబాద్ ఆర్డీ కార్యాలయాలను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ రెండు ఆర్డీ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయన్న విమర్శలు... బదిలీలు, నియామకాలు, పదోన్నతుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వైద్యశాఖ ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఆర్డీ కార్యాలయాల ఎత్తివేత, ఆర్డీల అధికారాల కత్తిరింపునకు సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. దీనిపై వీలైనంత త్వరలో తుది నిర్ణయం తీసుకుని కార్యాలయాలను ఎత్తివేయనున్నారని సమాచారం. ఆర్డీ కార్యాలయాలను హైదరాబాద్  కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కలిపేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్డీలను ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో అదనపు సంచాలకులుగా నియమించి వారి సేవలను ఉపయోగించుకుంటారు. ఇక ఆర్డీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని అవసరాన్ని బట్టి స్థానికంగా సర్దుబాటు చేయడంతోపాటు... అందులో కొందరిని హైదరాబాద్ ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలోకి తీసుకొస్తారని అంటున్నారు.

 ఆరోగ్య ఉప జిల్లాలపై యోచన ..
 ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఆర్డీ కార్యాలయాలు ఉండగా, రాష్ట్రం విడిపోయాక మూడు ఆంధ్రకు, రెండు తెలంగాణకు ఉండిపోయాయి. గతంలో అధికార వికేంద్రీకరణ కోసం వీటిని ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాలతో కలిపి ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసి, ఆర్డీలకు పూర్తిస్థాయి అధికారాలు కల్పించారు. దీని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. పీహెచ్‌సీలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు అన్నీ ఆర్డీ పరిధిలో ఉన్నాయి. నియామకాలు, పదోన్నతులు, డిప్యూటేషన్లు చేసే అధికారాలు కూడా ఆర్డీలకున్నాయి. అపరిమితమైన అధికారాలు ఉండడంతో ఆర్డీ కార్యాలయ అధికారులు వాటిని అవినీతి, అక్రమాలకు నెలవుగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

అంతేకాకుండా రాష్ట్రం చిన్నదైపోయినందున ఆర్డీ కార్యాలయాలను ఎందుకు కొనసాగించాలన్న ఆలోచన కూడా సర్కారు దృష్టిలో ఉంది. ఇదిలా ఉంటే ఆర్డీ వ్యవస్థను  తొలగించి... ఆరోగ్య ఉప జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల జిల్లాల ద్వారానే పని వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో జిల్లాను రెండు.. మూడు ఆరోగ్య ఉప జిల్లాలుగా ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా ఒక వైద్యాధికారిని నియమించడం ద్వారా మరింత వికేంద్రీకరణ చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. దీంతో పరిపాలనా పరమైన జిల్లాను యూనిట్‌గా కాకుండా ఆరోగ్య ఉప జిల్లానే యూనిట్‌గా తీసుకొని వైద్య సేవలను విస్తరించాలని సర్కారు భావిస్తోంది. తద్వారా కిందిస్థాయిలో రోగులకు వైద్య సేవలు మెరుగ్గా అందుతాయని అంటున్నారు.

మరిన్ని వార్తలు