బస్తీకి సుస్తీ!

14 Jul, 2016 23:46 IST|Sakshi
బస్తీకి సుస్తీ!

సిటీబ్యూరో:  నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాల లక్షణాలతో వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. బస్తీల్లో అపరిశుభ్ర వాతావరణం, వర్షం నీరు నిల్వ ఉండడం, దోమలు, ఈగలు పెరగడంతో ప్రజలు టైఫాయిడ్, డయేరియా, కలరా, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ైెహ దరాబాద్ జిల్లాలో 24 కలరా, 1500పైగా డయేరియా, 69 మలేరియా, 60పైగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. మరోవైపు రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందడం లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువవుతాయని తెలిసినప్పటికీ ఆయా ఆస్పత్రుల్లో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. వైద్యుల సంఖ్యా అంతంతమాత్రంగానే ఉంది.

ఫీవర్‌కు పోటెత్తిన రోగులు
రోగాలబారిన ప్రజలు చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడం, ఓపీలో తగినంత మంది వైద్యులు లేక పోవడంతో అస్వస్థతకు గురైన రోగులకు గంటల తరబడి ఓపీ క్యూలైన్‌లోనే పడిగాపులు తప్పడం లేదు. మధుమేహంతో బాధపడుతున్న రోగులు స్పృహ తప్పి పడిపోతుండగా, జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదే సమయంలో సహనం కోల్పొయిన కొంత మంది రోగులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన వైద్యాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
 
నిలోఫర్ ఓపీలో కన్పించని సీనియర్లు
నిలోఫర్ ఆస్పత్రికి నవజాత శిశువులే కాకుండా 12 ఏళ్లలోపు పిల్లలకు కూడా చికిత్సలు అందిస్తుంటారు. 550 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వెయ్యి మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు తగినన్ని వార్మర్లు, వెంటిలేటర్లు లేక మృత్యువాతపడుతున్నారు. ఇక జలుబు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, టైఫాయిడ్, డెంగీ, మలేరియాతో బాధపడుతున్న 12 ఏళ్లలోపు వారు అధిక సంఖ్యలో వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక పోవడంతో ఒక్కొ మంచంపై ఇద్దరు ముగ్గురు చిన్నారులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. ఉదయం 8.30 గంట లకే ఓపీలో ఉండాల్సిన వైద్యులు 11 దాటినా రావడం లేదు. ఓపీ సహా అత్యవసర విభాగంలోనూ జూనియర్లు మినహా సీనియర్ వైద్యులు కన్పించడం లేదు.    

ఉస్మానియా, గాంధీలోనూ అదే పరిస్థితి..
ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు ఇటీవల కాలంలో రోగులు పోటెత్తుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ఇన్‌పేషంట్ వార్డులు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. వీరిలో జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నవారే అధికంగా ఉంటున్నారు. ఓపీలో వైద్యుడికి చూపించుకుని, ఆయన రాసిన టెస్టులు చేయించుకుని తిరిగి వచ్చే సరికి ఓపీ సమయం ముగిసిపోతోంది. శస్త్రచికిత్సల కోసం వచ్చిన రోగులే కాదు సాధారణ జ్వరాలతో వచ్చిన రోగులు సైతం రెండు మూడు రోజులు ఆస్పత్రిలో పడిగాపులు గాయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో అడ్మిషన్ కూడా దొరక్క పోవడంతో చాలా మంది చెట్లకిందే గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల శివారు ప్రాంతాల్లోని రైతులు, కూలీలు పాముకాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వీరికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో మృత్యువాతపడుతున్నారు.
 
 
ఫీవర్‌లో డెంగీ  కేసు నమోదు

నల్లకుంట: వాతావరణంలో వస్తున్న మార్పులతో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. దీంతో స్థానిక ఫీవర్ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసి పోతోంది. గురువారం ఓపీ విభాగంలో 1047 మంది రోగులు చికిత్సలు పొందారు. కాగా వీరిలో 37 మందిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
 
ఓ డెంగీ కేసు..

 రంగారెడ్డి పాత మల్లాపూర్‌కు చెందిన పార్వతదేవి(30) తీవ్రమరైన జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్సల కోసం ఫీవర్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన అక్కడి వైద్యులు క్లినికల్ డెంగీగా నమోదు చేసుకుని ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నారు. అబ్దుల్ బాబానగర్ కిషన్ బాగ్ నివాసిఅబ్దుల్ మాజిద్  కూతురు ఫర్హీన్ (9) తీవ్రమైన జ్వరంతో పాటు ఒళ్లు బిగుసుకు పోతుంది. దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్సల కోసం ఫీవర్‌కు తీసుకు వచ్చారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యు టెటానస్‌గా నిర్ధారించి చికిత్సలు అందిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు