సీటు బెల్ట్‌ ప్రాణదాతే!

11 May, 2017 00:03 IST|Sakshi
సీటు బెల్ట్‌ ప్రాణదాతే!

కార్లలో దీని వినియోగం తప్పనిసరి
అనేక ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడిన వైనం


సిటీబ్యూరో: ద్విచక్ర వాహనానికి హెల్మెట్‌... తేలికపాటి వాహనానికి సీటుబెల్ట్‌... నిబంధనల ప్రకారం ఇవి కచ్చి తం. కేవలం అనేక హైఎండ్‌ కార్లలో సీటుబెల్ట్‌కు–ఎయిర్‌బ్యాగ్‌కు ఉన్న లింకు కారణంగానే కాదు... ఎయిర్‌బ్యాగ్స్‌ లేని వాహనాల్లోనూ సీట్‌బెల్ట్‌ వాడటం తప్పనిసరి. ఇది అనేక సందర్బాల్లో ప్రాణదాతగా మారింది. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్‌ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రయాణిస్తున్న కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ... వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా... హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా... అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా డ్యాష్‌ బోర్డ్స్‌ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చు న్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్‌ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. కాబట్టి సీట్‌బెల్ట్‌ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు.

...వారి ప్రాణాలు కాపాడిన ‘బెల్ట్‌’...
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్‌ 21న హైదరాబాద్‌ శివార్లలోని మెదక్‌ జిల్లా కొల్లూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపు ప్రభావంతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చింది.

భుజం పైనుంచి సీట్‌బెల్ట్‌ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. ఈ కారణంగానే ఆరవ్‌ రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. అతడి శరీరంలో మరెక్కడా ఫ్యాక్చర్స్‌ సైతం ఏర్పడలేదు. 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్‌ రెయిలింగ్‌ను బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణిì , డ్రైవర్‌ స్వామిదాసు అక్కడికక్కడే కన్నుమూశారు. సీటుబెల్ట్‌ పెట్టుకున్న నేపథ్యంలోనే వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని వార్తలు