రెండో విడత వేలంతో రూ.200 కోట్లు రాబడి

20 May, 2016 04:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) గురువారం నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలం ద్వారా ఖజానాకు సుమారు రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 30 ప్లాట్లకు సంబంధించి గురువారం పరిశ్రమల భవన్‌లో ఈ వేలం విధానం ద్వారా అమ్మకం జరిపారు. 133 ఎకరాలను వేలానికి పెట్టగా 33 ఎకరాలను కొనుగోలుదారులు ఈ వేలం ద్వారా సొంతం చేసుకున్నారు.

పారిశ్రామిక, గృహ అవసరాల కోసం నిర్వహించిన వేలంలో పలు ప్లాట్లకు గరిష్ట ధర దక్కింది. ఖానామెట్‌లో గరిష్టంగా ఎకరానికి రూ.29 కోట్ల చొప్పున.. కున్ మోటారెన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇదే ప్రాంతంలో మరో ప్లాటుకు ఎకరాకు రూ.18.20 కోట్లు పలికింది. గృహ అవసరాల కోసం ఉద్దేశించిన ప్లాట్లలో అత్యధికంగా షేక్‌పేట మండలం అల్ హమ్రా కాలనీలో చదరపు గజానికి రూ.76,200 చొప్పున 920 గజాలకు రూ.7 కోట్ల మేర ధర పలికింది.

మిగతా ప్రాంతాల్లోనూ భూములు అధిక ధరలకు అమ్ముడయ్యాయని, దశలవారీగా మరికొన్ని ప్లాట్లను వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా రెండో విడత వేలంలో 54 ప్లాట్లను వేలం వేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసినా.. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ భూములపై కోర్టు కేసుల నేపథ్యంలో వేలం నిలిచిపోయింది. ఈ భూములను కూడా వేలం వేస్తే ప్రభుత్వానికి మరో రూ.500 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశముందని టీఎస్‌ఐఐసీ వర్గాలు వెల్లడించాయి.
 
తొలి విడతలో అత్యధికంగా రూ.29.2 కోట్లు
గత ఏడాది నవంబర్ 25న 27 భూముల తొలి విడత వేలానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి, వేలం వేయగా.. ఎనిమిది చోట్ల భూముల అమ్మకాలకు స్పందన లభించింది. తొలి విడతలో జరిగిన భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.329 కోట్ల మేర ఆదాయం లభించింది. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అత్యధికంగా ఎకరాకు రూ.29.28 కోట్లు కోట్ చేసి ఐదెకరాలను దక్కించుకుంది. రాయదుర్గంతో పాటు మణికొండ, కోకాపేట ప్రాంతాల్లోనూ నివాస స్థలాల వేలానికి మంచి స్పందన లభించింది. 2007-08లో జరిగిన వేలం ద్వారా సగటున ఎకరాకు రూ.18 కోట్ల నుంచి రూ.23 కోట్ల మేర పలికింది.

మరిన్ని వార్తలు