పిల్లల చదువు అక్కడా.. ఇక్కడా?

10 Jun, 2016 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘సోమవారం నుంచి స్కూళ్లు తెరుస్తారు.. పిల్లలను హైదరాబాద్‌లో స్కూలుకు పంపాలా లేక నూతన రాజధానిలో స్కూలు చూసుకుని చేర్చాలో తెలియడం లేదు.. జూన్ 27 నుంచి వెలగపూడి వెళ్లి పని చేయాల్సిందేనని ఒక పక్క సీఎం బాబు చెబుతున్నారు.. మరోవైపు తరలింపునకు సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.. సీఎస్ శనివారం నుంచి తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు.. ఆయన ఇంటి నుంచే విధు లు నిర్వర్తిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేద’ని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు.

సీఎస్ చెప్పినట్లు వెలగపూడిలో భవనాల నిర్మాణం పూర్తి కావడం ఆధారంగా దశల వారీగా తరలింపు ఉంటుంది. అయితే 27న ఏ శాఖలు వెళ్లాలో ముందుగా తెలపక పోవడంతో పిల్లలను ఎక్కడ చదివించాలో  తెలియడం లేదని ఆర్థిక శాఖ లోని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరలింపు ఉత్తర్వులు ఇవ్వనందున సోమవారం నుంచి హైదరాబాద్‌లో స్కూళ్లకే పిల్లలను పంపిస్తామని, ఆ తర్వాత 27లోగా ఉన్నట్టుండి తరలి వెళ్లాలని ఉత్తర్వులు ఇస్తే మా పరిస్థితేంటని మరో ఉద్యోగి ప్రశ్నించారు. ఏ శాఖలు వెళ్లాలో ఇప్పటికే చెప్పామని సీఎం చెబుతున్నా సచివాలయంలో ఏ శాఖకూ అలాంటి సమాచారం లేదంటున్నారు.
 
జల వనరుల శాఖను ఎప్పుడు తరలిస్తారో చెప్పాలి
జల వనరుల శాఖను ఏ తేదీన తరలిస్తారో స్పష్టంగా చెప్పాలి. అందుకనుగుణంగా పిల్లల చదువులు, కుటుంబం తరలింపుపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మా పాప మూడో తరగతి చదువుతోంది. 27న తరలింపులో జల వనరుల శాఖ ఉంటే మా పాపను అమరావతి  వద్ద స్కూల్లో చేర్పిస్తాను.
- వెంకట్రామిరెడ్డి, జలవనరుల శాఖాధికారి

>
మరిన్ని వార్తలు