సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రత్యేకతలు

2 Feb, 2017 00:24 IST|Sakshi
సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రత్యేకతలు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఆధునిక హంగులు
చుట్టూ వాణిజ్య సముదాయాల అభివృద్ధి
పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో పనులు
త్వరలో టెండర్ల ఆహ్వానం
‘వరల్డ్‌ క్లాస్‌’ స్థానంలో ‘రీ మోడలింగ్‌’


సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక కొత్త సొబగులు సంతరించుకోనుంది. రీమోడలింగ్‌లో భాగంగా అత్యాధునిక సదుపాయాలు, సరికొత్త హంగులతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికులకు అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోకి తేవడంతో పాటు, వాణిజ్య సదుపాయాలను కల్పిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులే కాకుండా నగరవాసులు కూడా సందర్శించేందుకు అనుగుణంగా స్టేషన్‌ బయట రెండు ఎకరాల విస్తీర్ణంలో వాణిజ్య భవనాలు నిర్మించనున్నారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్న ఈ వాణిజ్య కేంద్రాలలో మల్టిప్లెక్స్‌ థియేటర్‌లు, రెస్టారెంట్‌లు, త్రీస్టార్‌ హోటల్‌లు, ఇతర వినోద సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు తాజా కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన 25 రైల్వేస్టేషన్‌ల ఆధునీకరణలో దక్షిణమధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో చేపట్టనున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీమోడలింగ్‌  కోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

రెండో దశకు నిధుల కొరత లేదు...
ఎంఎంటీఎస్‌ –2 ప్రాజెక్టుతో పాటు,  ఘట్కేసర్‌ నుంచి  రాయగిరి  వరకు తలపెట్టిన  ఎంఎంటీఎస్‌–3వ దశ యాదాద్రి ప్రాజెక్టుకు సైతం నిధుల కొరత లేదని  జీఎం పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం తెలంగాణలో  నిర్మాణంలో ఉన్న  అన్ని  ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.1729 కోట్లు కేటాయించిందని, గత సంవత్సరం అందజేసిన  రూ.601 కోట్లకు ఇది రెట్టింపు కంటే ఎక్కువేనని జీఎం సంతోషంవ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్‌ రెండో దశతో పాటు,యాదాద్రి ప్రాజెక్టులను కూడా సకాలంలో చేపట్టి పూర్తి చేస్తామన్నారు. అలాగే  చర్లపల్లి  రైల్వే టర్మినల్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే శంకుస్థాపన చేయనున్నట్లు  పేర్కొన్నారు.

పింక్‌బుక్‌లో ప్రకటించాకే పూర్తి వివరాలు...
ఈ ఆర్ధిక సంవత్సరం రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లు, కొత్త లైన్‌లు, దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులు, తదితర అంశాలపై  పింక్‌ బుక్‌లో ప్రకటించిన తరువాతనే వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 3వ తేదీ న పింక్‌బుక్‌లో  నమోదు చేసిన అనంతరం  పూ ర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.   నిజాం హయాంలో  నిర్మించిన ఈ  చారిత్రాత్మక రైల్వేస్టేషన్‌   ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు  ప్రధాన  రైల్వే కేంద్రంగా విలసిల్లుతోంది. ప్రతి రోజు  సుమారు 80 ఎక్స్‌ప్రెస్‌లు, 100 ప్యాసింజర్‌ రైళ్లు, మరో  60 ఎంఎంటీఎస్‌ రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తాయి. నిత్యం  2.5 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు.  అన్ని కేటగిరీల ప్రయాణికులు, ఇతర మార్గాల నుంచి  ప్రతి రోజు సుమారు  రూ.3.5  కోట్ల ఆదాయం లభిస్తుంది.

>
మరిన్ని వార్తలు