సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సెక్యూరిటీ సూపర్‌వైజర్ దారుణం

24 Oct, 2016 16:26 IST|Sakshi
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సెక్యూరిటీ సూపర్‌వైజర్ దారుణం
ఉద్యోగినులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సెక్యూరిటీ సూపర్‌వైజరే ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించిన ఘటన ఇది. ఒక ఎంఎన్‌సి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి.. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి ఇంటికి బయల్దేరింది. కంపెనీ క్యాబ్‌లోనే ఆమె ఇంటివరకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె ఒక్కరే ఉండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం సెక్యూరిటీ సూపర్‌వైజర్ కూడా క్యాబ్‌లో ఎక్కాడు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది ముందు సీట్లో కూర్చోవాల్సి ఉంది. కానీ, అతడు ఆమెతోపాటే వెనుక సీట్లో కూర్చుని ఆమెతో కబుర్లు మొదలుపెట్టాడు. అనవసరమైన మాటలు మాట్లాడుతుండటంతో.. డ్రైవర్‌ను క్యాబ్ ఆపమని ఆమె కోరింది. కానీ, అతడు కూడా సూపర్‌వైజర్‌కు సహకరిస్తూ క్యాబ్ ఆపలేదు. దాంతో ఆమె గట్టిగా అరిచి, సూపర్‌వైజర్‌ను కారులో ఒక మూలకు తోసేసింది. దాంతో భయపడిన వాళ్లిద్దరూ తర్వాత ఆమెను ఇంటివద్ద దింపేశారు. 
 
దీనిపై ఆమె షీటీమ్స్‌కు ఫిర్యాదుచేయడంతో.. సూపర్‌వైజర్ ఇందూరి వేణుగోపాల్, క్యాబ్ డ్రైవర్ చాకలి శ్రీకాంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళపై జరిగిన నేరం కాబట్టి సైబరాబాద్ షీ టీమ్స్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, విచారించారు. విచారణలో వాళ్లు ఆమెపై అత్యాచారయత్నం చేయబోయినట్లు అంగీకరించారు. ఘటనకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో షీటీమ్స్ బృందం ఉంది.
మరిన్ని వార్తలు