ఆ బాలికను మాకే ఇవ్వాలి..

15 Jul, 2016 01:58 IST|Sakshi

కోర్టులో రూపేశ్ తల్లి, కాంగో రాయబారి వేర్వేరు పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: అమ్మ హతమై... నాన్న జైలుపాలై... చివరకు ఒంటరై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న తొమ్మిదేళ్ల చిన్నారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాపను తమకు ఇవ్వాలని రూపేశ్‌కుమార్ తల్లి లలిత... తమ దేశస్తురాలైన సింథియా కూతుర్ని తమకే అప్పగించాలని కాంగో రాయబారి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి 8వ మెట్రోపాలిటన్ కోర్టులో వారు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను స్వీకరించిన న్యాయమూర్తి రాధిక జైస్వాల్ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ‘దయతలచి మా మనవరాలిని మాకు అప్పగించండి. హైదరాబాద్‌లో చదివిస్తా.

ఇతర మనుమలు, మనవరాళ్లతో సమానంగా పోషిస్తా. ఆర్థికంగా మాకు ఎలాంటి లోటూ లేదు’ అంటూ నానమ్మ లలిత పిటిషన్‌లో అభ్యర్థించారు. ‘సింథియా వెచెల్, రూపేశ్‌కుమార్‌లకు కాంగోలో నివసిస్తుండగానే ఈ బాలిక జన్మించింది. పాస్‌పోర్టు కూడా కాంగోదే. కనుక చిన్నారి కాంగో దేశానికే చెందుతుంది. ఆమెపై మాకే హక్కులున్నాయి’ అని కాంగో రాయబారి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాంగోకు చెందిన సింథియాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రూపేశ్‌కుమార్ ఆమెను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రూపేశ్ 3 రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరోవైపు పోలీసులు చిన్నారికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించారు.
 
బాలిక ఫొటోలు వాడవద్దు: సీపీ మహేశ్
అమ్మానాన్నల సంతోషానికి దూరమై ఇప్పటికే మానసికంగా బాధపడుతున్న చిన్నారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించేలా ఎవరూ వ్యవహరించకుండా రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రూపేశ్ కుమార్తె పేరు కానీ, ఆమెకు సంబంధించిన ఫొటోలు కానీ ప్రచురించడం, టీవీల్లో వీడియోలు ప్రసారం చేయడం తగదని సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ గురువారం ఆదేశాలిచ్చారు. దీన్ని అతిక్రమిస్తే రూ.25 వేల జరిమానా విధిస్తామన్నారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినా చర్యలు తప్పవన్నారు.

మరిన్ని వార్తలు