దోపిడీ కేసులో ఏడుగురికి జీవితఖైదు

27 Jul, 2016 00:15 IST|Sakshi

బంజారాహిల్స్‌ :  తమ వద్ద అరుదైన విగ్రహాలు ఉన్నాయంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను నమ్మించి వారిని బంధించి ఆభరణాలతో పాటు లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన ఘటనలో నిందితులకు కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2009లో ఈసంఘటన జరిగింది. 2009 మే 10న కె.శ్రీధర్, సత్యజిత్‌ రాజేష్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, తనుజిత్‌కుమార్, ఎస్‌. పోతురాజు, రామలింగ ప్రసాద్‌ తదితరులు తమ వద్ద అరుదైన విగ్రహాలున్నాయని నమ్మబలికారు.

 

ఇందుకు ఆకర్షితులైన వరంగల్‌జిల్లాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి జ్యోతికుమార్, కేరళకు చెందిన కేబీ బహులేయం, కోయంబత్తూర్‌కు చెందిన ఆర్‌. శివం వీరిని సంప్రదించారు. తమ వద్ద అరుదైన అక్షయపాత్ర ఉందని ఒకటికి రెండింతలవుతుందని నమ్మబలికారు. ఈముగ్గురూ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే నిందితులు వీరిని వెంకటగిరిలోని ఓ గదికి తీసుకువెళ్లి అక్కడ వీరిని బంధించి రూ. 5.50 లక్షల నగదుతో పాటు వారి వద్ద ఉన్న ఆభరణాలు పెద్ద మొత్తంలో దోచుకున్నారు. అంతేకాకుండా శివన్‌ భార్యకు ఫోన్‌ చేసి ఏటీఎం కార్డు ద్వారా లక్షలాది రూపాయలు డ్రా చేయించి పరారయ్యారు.

 

బాధితులు అదే రోజు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా 2009 జూలై 1న నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  ఆధారాలను జూబ్లీహిల్స్‌ పోలీసులు కోర్టుకు పక్కాగా సమర్పించారు. ఈ మేరకు మంగళవారం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

మరిన్ని వార్తలు