ఉద్యోగిపై లైంగిక వేధింపులు

15 May, 2017 00:21 IST|Sakshi

బసవతారకం ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌పై నిర్భయ కేసు

హైదరాబాద్‌: బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిహెచ్‌. సత్యనారాయణపై హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులు నిర్భయ చట్టం కింద ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం సంబాల్‌పూర్‌కు చెందిన సందీప్త నాయక్‌(43) బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో క్వాలిటీ అస్యూరెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆస్పత్రి పక్కనే వసతి గృహంలో ఆమె ఉంటోంది. మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిహెచ్‌. సత్యనారాయణ తరచూ ఆమెకు ఫోన్‌ చేసి తన చాంబర్‌కు పిలిపించుకునేవాడు.

కమిటీ షెడ్యూల్‌ క్వాలిటీ రౌండ్స్, ఆడిట్‌ మెడికల్‌ రికార్డ్స్‌ తదితర పనులపై ఆమెకు కాల్‌చేసేవాడు. తనతో డిన్నర్‌కు రావాలని, సినిమాలకు రావాలని, వారాంతపు సెలవుల్లో బయటకు వెళ్దామంటూ వేధింపులకు గురి చేసేవాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు పాల్పడేవాడు. దీనికి ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో మానసికంగా, ఉద్యోగరీత్యా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె కార్మిక శాఖ అధికారులతోపాటు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ సిహెచ్‌. సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్‌ 354(ఏ), 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు