రోడ్డెక్కిన ‘షీ క్యాబ్స్’

20 Feb, 2014 04:29 IST|Sakshi
రోడ్డెక్కిన ‘షీ క్యాబ్స్’

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోనే ప్రథమంగా మహిళల కోసం మహిళలే నడిపే ‘షీ క్యాబ్స్’ రోడ్డెక్కాయి. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో నడిచే ఈ క్యాబ్స్‌ను పబ్లిక్‌గార్డెన్స్‌లో బుధవారం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, ట్రాఫిక్ డీసీపీ సుధీర్‌బాబు, సామాజిక కార్యకర్త రాగిడి లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంలో నీలం సహానీ మాట్లాడు తూ మహిళలే క్యాబ్ నడిపిస్తామని ముందుకు రావడం గొప్ప విషయమన్నారు.

ఈ క్యాబ్‌లు రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు విస్తరించాలన్నారు. షీ క్యాబ్స్ ఎండీ విజయారెడ్డి మాట్లాడుతూ... ముందుగా రెండు క్యాబ్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆదరణను బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తా మన్నారు. నగరాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు వీటిని ప్రవేశపెట్టామన్నారు.

క్యాబ్‌లో జీపీఎస్ విధానాన్ని అమర్చామన్నారు. క్యాబ్ కావల్సినవారు 9393024242కు ఫోన్ చేయాలని సూచించారు. కరాటే మాస్టర్ నరేందర్ ఆత్మరక్షణకు మెళకువలు ప్రదర్శించారు. మొదటి ప్రయాణికురాలిగా అదనపు ఎస్పీ పద్మజ ప్రయాణించారు. షీక్యాబ్స్ సీఈఓ అనురాధారావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు