ఆ మిస్టరీల వెనుక నయీం భాయ్!

24 Aug, 2016 04:18 IST|Sakshi
ఆ మిస్టరీల వెనుక నయీం భాయ్!

సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: కరుడుగట్టిన నేరగాడు... చుట్టూ మహిళా సైన్యం... టార్గెట్‌ చేసిన వాళ్ళను ముక్కలుగా నరికిపారేసే సంస్కృతి... గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు సంబంధించి ఒక్కొక్కటగా వెలుగులోకి వస్తున్న వ్యవహారాలివి. ఈ పూర్వాపరాలను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలకు నయీమ్‌తో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే రూఢీ చేయడానికి సరైన ఆధారాలు లభించాల్సి ఉందని పేర్కొంటున్నారు. నాటి మృతదేహాల పరిస్థితులు, ఏళ్ళుగా నగర శివార్లలోనే మకాం ఉన్న నయీమ్, అతడి ఎన్‌కౌంటర్‌ తర్వాత వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారు. ఆ హత్యలు–కరుడుగట్టిన నేరగాడి ప్రమేయంపై అనుమానించడానికి కారణాలు ఇవీ...

కేస్‌–1: మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3 మధ్యాహ్నం టోలిచౌకి వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి  అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు  తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండటంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్‌ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్‌ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది.
 

అనుమానాలకు కారణం:
గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ తన చుట్టూ ‘గడాఫీ సైన్యాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు. యువతులు, మహిళలకు వివిధ రకాలైన సాయుధ శిక్షణలు ఇచ్చి రక్షణగా పెట్టుకున్నాడు. అంతేకాదు... అనేక దారుణ హత్యల్ని సైతం వారితోనే చేయించాడు. నిత్యం అతడి వెంటే ఉండే కి‘లేడీ’ల సహకారంతోనే తన ఇంట్లో హత్య చేసిన నదీం, నస్రీన్‌ మృతదేహాలను కొత్తూర్, మంచిరేవుల వరకు తీసుకువెళ్ళి పడేశాడు. మెహదీపట్నం బస్టాండ్‌లో మహిళ మృతదేహంతో కూడిన సూట్‌కేస్‌ను తీసుకువచ్చింది మహిళలే. ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో కలిసి టోలిచౌకి వైపు నుంచి వచ్చారు. నయీమ్‌ డెన్‌ బయటపడిన ప్రాంతాలు ఆ మార్గంలోనే ఉన్నాయి.

కేస్‌–2: సుల్తాన్‌బజార్‌ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్‌  వద్ద 2010 డిసెంబర్‌ 20న ఓ మృతదేహం ‘ముక్కలుగా’ లభించింది. ఓ ప్లాస్టిక్‌ సంచిలో తల, కాళ్లు లేని మొండెం కనిపించింది. మృతదేహాన్ని బట్టి వయస్సు 16 నుండి 20 ఏళ్ళ మధ్య ఉంటుందని నిర్థారించారు. సర్జికల్‌ బ్లేడ్‌తో తల, కాళ్ళు కోసినట్లు స్పష్టమైంది. ఇది జరిగిన రెండో రోజున నారాయణగూడ ఠాణా పరిధిలో ఈ మృతదేహం కాళ్లు లభించాయి. దీని తల ఇప్పటికీ లభించకపోగా... కేసు సైతం కొలిక్కి రాలేదు.
అనుమానాలకు కారణం:
పాశవిక హత్యలకు నయీమ్‌ కేరాఫ్‌ అడ్రస్‌. 1996లో మావోయిస్టు ఈదన్నను చంపి ముక్కలు చేసి వేర్వేరుగా విసిరేశాడు. ఆపై బెల్లి లలితను టార్గెట్‌ చేసిన నయీమ్‌ తన అనుచరులతో దారుణంగా చంపించి 16 ముక్కలు చేయించి ఎక్కడెక్కడో పడేశాడు. రామ్‌కోఠిలో లభించిన మృతదేహం పరిస్థితీ ఇదే కావడంతో పాటు నయీమ్‌ డెన్స్‌లో మైనర్లు సైతం ఎక్కువ మంది ఉండే వారని, నస్రీన్‌ అనే 17 పని పిల్లను  దారుణంగా చంపేశాడని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

కేస్‌–3: వనస్థలిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్‌ 28న మరో డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్‌ డ్రమ్‌ను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తులు గుర్తించారు. తీసుకువెళ్దామనే ఉద్దేశంతో దాన్ని పరికించి చూడగా డ్రమ్‌ పైభాగంలో తెలిరిచి ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్‌ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్‌ చేసి టేప్‌ వేసినట్లు గుర్తించారు. వీటిని తొలగించగా అందులో శవం ఉన్నట్లు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసూ కొలిక్కి చేరలేదు. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్‌ అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అనుమానాలకు కారణం: నయీమ్‌కు రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని వివిధ ప్రాంతాలతో పాటు వనస్థలిపురం ప్రాంతంలోనూ డెన్స్‌ ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌ తర్వాత అక్కడి నయీమ్‌ అనుచరుల ఇళ్ళపై దాడులు చేసిన పోలీసులు నగదు, ఆస్తిపత్రాలతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హతుడిది శివారు జిల్లాలై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ రెండు జిల్లాల్లోనూ నయీమ్‌కు విస్తృతమైన నెట్‌వర్క్‌  ఉంది. అనుచరులు, శత్రువులు, టార్గెట్లు సైతం నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు.

మరిన్ని వార్తలు