నిప్పు...ముప్పు!

30 Mar, 2016 01:04 IST|Sakshi
నిప్పు...ముప్పు!

ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని నగరం
తాఖీదులిచ్చినా  స్పందించని సంస్థలు
ప్రమాదం సంభవిస్తే అంతే సంగతులు

 

 

సాక్షి, సిటీబ్యూరో: అది నగరంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్. నిత్యం వేలాది మంది అక్కడికి వస్తుంటారు. అంతపెద్ద షాపింగ్ మాల్‌లో ఏ మూలన నిప్పు అంటుకున్నా... భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే... అక్కడ అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే ఏర్పాట్లు ఏమాత్రం లేవు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని ఇలాంటి భవనాలు మహా నగరంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఎండలు మండుతున్న ప్రస్తుత తరుణంలో అనుకోకుండా ఏదేని అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అదుపులోకి తెచ్చే సదుపాయాలు వీటిలో కానరావు.

అయినా ఆ సంస్థలు దర్జాగా తమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లు.. షాపింగ్‌మాళ్లు.. లాడ్జీలు..పెద్ద పెద్ద భవనాలు.... అంతస్తులపై అంతస్తులు... నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు... ఏటా రూ.కోట్లలో వ్యాపారం.  అగ్ని ప్రమాదాలను     నిరోధించే తీరులో నిర్లక్ష్యం... ఇదీ నగరంలోని షాపింగ్‌మాల్స్...కొన్ని ఆస్పత్రులు... పాఠశాలల పరిస్థితి. ‘హెచ్చరికల’తో సరిపెడుతున్న అధికారుల సాక్షిగా వారి అరాచకాలు సాగుతున్నాయి.  ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

హోటళ్లు... హాస్పిటళ్లు... పాఠశాలలు... అన్నిటిదీ ఒకటే దారి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికార యంత్రాంగం... కొద్ది రోజులకే ఆ విషయం మరచిపోతోంది. దీంతో పరిస్థితి షరా మామూలుగా మారుతోంది. నిర్ణీత వ్యవధిలోగా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోకపోతేవ్యాపార సంస్థలను సీజ్ చేస్తామని... ట్రేడ్ లెసైన్సులు రద్దు చేస్తామని... ఆస్పత్రుల లెసైన్సుల రద్దుకు కూడా వెనుకాడబోమనే హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.

ఏళ్ల తరబడి సాగుతున్న ఈ తంతులో మార్పులేదు. గతంలో అధికారులు 380 షాపింగ్‌మాల్స్‌ను తనిఖీ చేసి... ఒక్క దానిలోనూ ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవని గుర్తించారు. ఇప్పటికీ వాటిలో ఎన్నింట్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లున్నాయో వివరాలు లేవు. ఇటీవల నోటీసులిచ్చినా... స్పందించిన వారు స్వల్పం. జీహెచ్‌ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)లు పొందిన వ్యాపార సంస్థల సంఖ్య వేళ్ల మీద లెక్క పెటవచ్చు. ఏ తరహా వ్యాపార సంస్థలు ఎన్ని ఉన్నాయనే లెక్కలూ అధికారుల వద్ద లేవు.

 ప్రకటనలకే పరిమితం        
ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఏటా ప్రకటనలు చేస్తున్నప్పటికీ... ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు లేవు. సంబంధిత యాజమాన్యాలు సైతం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వెంటనే అదుపు చేసే ఏర్పాట్లు లేకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి.

 అధికారం లేనందునే...
ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించని వారిపై ప్రత్యక్షంగా చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీకి అధికారం లేకపోవడమే ఉల్లంఘనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఫైర్‌సేఫ్టీ పాటించని భవన యజమానులపై కోర్టులో కేసు న మోదు చేయడం.. న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం మినహా.. తమంత తాముగా చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీకి అధికారాలు లేవు.

ఈ నేపథ్యంలో.. ఫైర్‌సేఫ్టీ లేని ఆస్పత్రులపై జిల్లా వైద్యాధికారుల ద్వారా... ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ ద్వారా... ఇతరత్రా సంస్థలపై సంబంధిత శాఖల ద్వారా అనుమతులు, లెసైన్సులు రద్దు చేయించాలని భావించారు. గతంలో ఆ దిశగా కొంత కసరత్తు చేశారు. అనంతరం మరిచిపోయారు. దీంతో పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోంది.

మరిన్ని వార్తలు