ఫిరాయింపులపై చర్యల అధికారం ఈసీకే ఇవ్వాలి

1 Aug, 2016 08:11 IST|Sakshi

ఆ విధంగా తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలి
న్యాయ నిపుణులు, రాజకీయ, సామాజికవేత్తల సూచన
ఫిరాయించిన వారిని స్పీకర్లు కాపాడుతున్నారు
పార్టీల ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర అనే అంశంపై చర్చ
 
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలని న్యాయ నిపుణులు, రాజకీయ, సామాజికవేత్తలు ముక్తకంఠంతో కోరారు. దేశ రాజకీయాల్లో పెట్రేగిపోతున్న పార్టీ ఫిరాయింపులు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నాయన్నారు. అధికారంలోని పార్టీలు విపక్ష పార్టీల సభ్యులను గంపగుత్తగా కొనుగోలు చేస్తున్నాయని ..విపక్షాలు లేని చట్ట సభ ఫాసిస్టు వ్యవస్థతో సమానమని అభిప్రాయపడ్డారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర వ్యక్తులుగా ఉండాల్సిన స్పీకర్లు అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారన్నారు. ‘పార్టీల ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానభవన్‌లో నిర్వహించిన సదస్సులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, జస్టిస్ బి.శేషశయనా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడారు.

ఫిరాయిస్తేనే అనర్హులు కావాలి
ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆటోమెటిక్‌గా అనర్హులు కావాలి. ఆ మేరకు రాజ్యాంగ సవరణచేపట్టాలి.            - జస్టిస్ బి.శేషశయనారెడ్డి

స్పీకర్‌కు అసాధారణ అధికారాలతో సమస్యలు
 అసాధారణ నిర్ణయాధికారాలను స్పీకర్‌కు కట్టబెట్టడం వల్ల వారి నిర్ణయాలు రాజకీయ సంక్షోభాలు, వివాదాలను రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్తులో 300 మంది స్వతంత్ర సభ్యులు లోక్‌సభకు ఎన్నికైతే పరిస్థితి ఏమిటి? ఒక వేళ 10 కన్నా తక్కువ సీట్లను 50 పార్టీలు గెలుచుకుంటే  దేశంలో చెలరేగే అల్లకల్లోలం గురించి ఆలోచించాలి. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు సమస్యను మరింత జఠిలం చేస్తాయి. స్పీకర్‌లు పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ సిఫారసుతో ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌లకు కల్పించడమే పరిష్కార మార్గం.                                                                                                                                             - జస్టిస్ జీవన్ రెడ్డి

ఫిరాయింపుల భూతం పట్టుకుంది
ప్రజాస్వామ్యానికి పార్టీ ఫిరాయింపుల భూతం పట్టుకుంది. ఫిరాయింపులతో ప్రజాస్వామ్య పునాదులు బలహీనంగా మారుతున్నాయి. ఈ గందరగోళానికి రాజ్యాంగ పరిధిలోనే పరిష్కారాన్ని కనుగొనాలి. ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు కట్టబెట్టే విధంగా రాజ్యాంగ సవరణ జరపాలి.  స్పీకర్లు అధికార పార్టీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని కోర్టులు ఆదేశించే విధంగా చట్ట సవరణ జరగాలి.                             - జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
 

రాజీనామాలు ఆమోదించడం లేదు
 ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎక్కడా స్పీకర్లు అనర్హత వేటు వేసిన దాఖలాలు లేవు. ఒక వేళ ఫిరాయింపుదారులు రాజీనామా చేసినా స్పీకర్లు ఆమోదించడం లేదు. ఫిరాయింపుదాలరుపై అనర్హత వేటు వేసే అధికారం  ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అవిశ్వాస, విశ్వాస తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం సమయంలోనే విప్‌ను పరిమితం చేయాలి. సీఎంలను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. అప్పుడే రాజకీయాల్లో కొత్త ఒరవడి వస్తుంది.         -జేపీ
 

చర్యలెవరు తీసుకోవాలి?
 టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు తీసుకెళితే.. మంత్రిగా తలసానితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ విషయంలో తప్పు సీఎందా? గవర్నర్‌దా?. తలసాని ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేనే. ఈ విషయంలో ఎవరిపై ఎవరు చర్యలు తీసుకోవాలి?                 - కె.రామచంద్రమూర్తి

లా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
 ఈసీ సిఫారసు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌కు అప్పగించాలని లా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలి. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(3) సైతం అనుకూలంగా ఉంది.    - జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి
 

అప్పట్లోనే వ్యతిరేకించాను
 పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని 1985 లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం తీసుకొస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా నేను సమర్థించాను. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్‌కు కట్టబెట్టడం పెద్ద లొసుగుగా మారుతుందని అప్పట్లోనే నేను వ్యతిరేకించాను.    - జైపాల్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు