‘ఆ హోంగార్డు’లకు షోకాజ్ నోటీసులు!

29 Oct, 2016 03:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సమ్మె నేపథ్యంలో అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద ధర్నా, సచివాలయ ముట్టడికి యత్నం సహా మరికొన్ని నిరసనలకు హోంగార్డులు దిగారు. ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పరిస్థితి లాఠీచార్జ్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నగరంలోని ఐదు పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యారుు. వీటికి బాధ్యుల్ని గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన చిత్రాలను, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న, అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డుల్ని గుర్తిస్తున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇలా విభాగాలవారీగా ఉన్నతాధికారులు ఈ నోటీసులు తయారు చేస్తున్నారు. వీటిని సంబంధిత హోంగార్డులకు అందించి వారంలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేయనున్నారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకొంటారు.

>
మరిన్ని వార్తలు