ఎస్సై ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల

29 Apr, 2016 02:32 IST|Sakshi
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షా ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం విడుదల చేశారు. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వుడ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 17న రాత పరీక్షలు నిర్వహించింది. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో 510 పోస్టులకుగాను 1,74,962 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాయగా  88,875 మంది(50.79 శాతం) ఉత్తీర్ణత సాధిం చారు. వీరిలో పురుషులు 79,854 మంది కాగా.. మహిళలు 9,021 మంది ఉన్నారు. కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లో 29 పోస్టులకుగాను  10,584 మంది ప్రిలిమినరీ రాత పరీక్ష రాయగా 1,709 మంది (16.14 శాతం) అర్హత సాధించారు.

వీరిలో పురుషులు 1,513 మంది ఉండగా, మహిళలు 196 మంది ఉన్నారు. మొత్తమ్మీద పరీక్షా ఫలితాల్లో ఖమ్మం జిల్లా 54.36 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించగా.. మెదక్ జిల్లా అతి తక్కువగా కేవ లం 44 శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్‌లో దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు స్పష్టం చేశారు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు శుక్రవారం నుంచి మే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. జవాబు పత్రాల మధింపులో ఏమైనా అనుమానాలు ఉంటే మే 5వ తేదీలోగా అభ్యర్థులు నిర్దేశిత మొత్తం చెల్లించి ఓఎంఆర్ షీట్లు పొందవచ్చు. ఇందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనే అత్యధిక ఉత్తీర్ణత
ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు అతి తక్కువగా అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీ వారికి అర్హత మార్కులు అత్యధికంగా ఉండటంతో కేవలం 28.62 శాతం మంది మాత్రమే తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. ఎస్సై ప్రిలిమినరీలో జనరల్ కేటగిరీకి కటాఫ్‌గా 80 మార్కులు నిర్ణయించడంతో కేవలం 4,454 మంది మాత్రమే అర్హత సాధించారు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు.

ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 17,386 మంది(63.74 శాతం), ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు 22,882 మంది (61.54 శాతం) అర్హత సాధించారు. అలాగే బీసీ-ఏ కేటగిరీలో 5,742 మంది(42.77 శాతం), బీసీ-బీలో 18,422 మంది (49.20 శాతం), బీసీ-సీలో 174 మంది (31.35 శాతం), బీసీ-డీలో 17,728 మంది (48.19 శాతం) బీసీ-ఈలో 2,009 (30.19 శాతం) మంది అర్హత సాధించారు.

మరిన్ని వార్తలు