చిన్న జిల్లాగా సిద్దిపేట!

13 Aug, 2016 01:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘కొత్త జిల్లాలను ప్రజల ఇష్టాయిష్టాల మేరకు ఏర్పాటు చేయాలి. సుపరిపాలన దిశగా ముందడుగు వేసేలా కొత్త జిల్లాల ప్రతిపాదనలుండాలి’’ అని కొత్త జిల్లాల ముసాయిదా తయారీకి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఎదుట ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల, తుమ్మలతో కూడిన ఉపసంఘం శుక్రవారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమైంది. ప్రతిపాదిత జిల్లాల మ్యాపులతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

మెదక్ జిల్లా సమీక్షలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్ పాల్గొన్నారు. జనగామను జిల్లా చేయాలనే అభ్యర్థనలున్నాయని కడియం గుర్తు చేశారు. కాబట్టి వరంగల్ జిల్లాలోని జనగామ, చేర్యాల ప్రాంతాలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో కలిపే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జనగామ ప్రజలకు ఇష్టం లేకుంటే సిద్దిపేటలో కలపొద్దని హరీశ్ అన్నారు. ‘‘సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలతోనే సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసినా అభ్యంతరం లేదు.

అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న సిద్దిపేట చిన్న జిల్లాగా ఏర్పడితే రాష్ట్రంలో నంబర్‌వన్‌గా ఎదుగుతుంది’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం మండలాలను ప్రతిపాదిత సికింద్రాబాద్ జిల్లాలో కలుపవద్దని, సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని ప్రజాప్రతినిధులు కోరారు. అనంతరం నిజామాబాద్ జిల్లా సమీక్షకు మంత్రి పోచారం, ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్ హాజరయ్యారు. ‘‘ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపొద్దు. కామారెడ్డి జిల్లాలో ఉంచాలి.

బాన్సువాడ సెగ్మెంట్‌లోని వర్లి, కోటగిరి మండలాలను నిజామాబాద్‌లో కాకుండా కామారెడ్డిలో చేర్చాల’’ని కోరారు. అందరికీ ఆమోదయోగ్యంగా జిల్లాలు ఏర్పాటవుతాయని అనంతరం కవిత మీడియాతో చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా మంచిర్యాల (కొమురం భీమ్), నిర్మల్ జిల్లాల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఉపసంఘం శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం; ఆదివారం మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రతినిధులతో భేటీ కానుంది. 16న అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశముంది. సీఎం నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని మహమూద్ అలీ తెలిపారు.

మరిన్ని వార్తలు