పేరు మారలేదా... బండి సీజే!

1 Dec, 2015 00:14 IST|Sakshi

సుల్తాన్‌బజార్: వాహనదారులారా తస్మాత్ జాగ్రత్తా... మీరు కొనుగోలు చేసిన వాహనం మీ పేరుపై వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. లేకపోతే మాత్రం పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 15 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైైవ్ లో భాగంగా శనివారం, ఆదివారం ‘డ్రైైవ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వేరే వారి పేరుపై ఉన్న వాహనాలను నడుపుతున్న 200 మంది నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.  సోమవారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ ఆఫ్ వెహికిల్స్ 2వ కౌన్సెలింగ్ సెషన్‌ను నిర్వహించారు.

ఈ సెషన్‌కు ట్రాఫిక్ డీసీసీ రంగనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పట్టుబడ్డ 200 మంది వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారికి వాహనాలను తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా డీసీపీ రంగనాథ్ మాట్లాడుతూ... వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఫాం నె ం. 28, 29, 30 ఫారాలను నింపి విక్రయదారుడి సంతకం తీసుకోవడంతోనే ఆ వాహనం తమదైనట్లు భావించడం చెల్లదన్నారు. ఇలా చేయడం వల్ల వాహన విక్రేతకు, కొనుగోలుదారుడికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు.  సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసిన వారు డిసెంబర్ 31లోపు ఆ వాహనాలను తమ పేరుపై రిజిస్ట్రేషన్ మార్చుకోవాలని, లేకపోతే జనవరి 1 నుంచి సదరు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.   కార్యక్రమంలో ట్రాఫిక్ సౌత్‌జోన్ డీసీపీ సుంకర సత్యనారాయణ, చార్మినార్ ట్రాఫిక్ ఏసీపీ జె.భద్రేశ్వర్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఏసీపీ డాక్టర్ ప్రేంకాజల్ సిబ్బంది పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు